తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ఫొటోలను నిశితంగా గమనించారా? ఎడమ చేతిలో పెన్ను పట్టుకుని, ఏదో దీర్ఘాలోచనలో కనిపిస్తున్న సీఎం హావభావంలో ఏదేని విచారవదనం కూడా గోచరిస్తోందా? ఇంధన శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించినప్పటి చిత్రాలివి. ఈ ఫొటోలను సీఎంవో అధికారికంగానే విడుదల చేసింది. గురువారం దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో ఇవే ఫొటోలతో సీఎం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వార్తలు ప్రచురితమయ్యాయి కూడా. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, GENCO సీఎండీ హరీష్, SPDCL సీఎండీ ముషారఫ్, NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, REDCO VC&MD అనిల ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉఛిత విద్యుత్ కోసం ప్రత్యేక డిస్కమ్ ను ఏర్పాటు చేయాలని ఈ సమీక్షలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే అధికారిక సమీక్షా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా, దీర్ఘాలోచనతో కూడిన వదనంతో ఎప్పుడూ కనిపించలేదనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఓ కోణంలో ఫొటోలను పరిశీలించినపుడు సీఎం రేవంత్ రెడ్డి కాస్త విచారవదనంతో, ఏదో సీరియస్ గానే ఆలోచిస్తున్న భావనను కలిగిస్తున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి. దీర్ఘాలోచనతో, విచారవదనంతో కూడిన భిన్న భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సీఎం ఫొటోలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాగా గులాబీ పార్టీ అధికార పత్రిక ఈరోజు ఓ ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య పాదయాత్ర అంశంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందనేది ఆ పత్రిక కథనంలోని సారాంశం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం వెళ్లిన సందర్భంగా ఈ సీన్ చోటు చేసుకున్నట్లు గులాబీ పార్టీ అధికార పత్రిక తన కథనంలో నివేదించింది. తన పనితీరు నచ్చకపోతే పదవి నుంచి దించేసుకోండని కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారని, ఇందుకు మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిచారని ఆ పత్రిక కథనం. విపక్ష పార్టీ బీఆర్ఎస్ కరదీపిక పత్రిక కథనంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, నిన్నటి ఇంధన శాఖఫై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ గా, దీర్ఘాలోచన, కాస్త విచార వదనపు కవళికలతో కనిపించడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.