నారాయణపేట: ‘నీయవ్వ.. లాగుల తొండలిడ్సి కొడ్త బిడ్డా.. నువ్వనుకుంటున్నవేమో..? నా సంగతింకా తెల్వది.. మీ నాయినను అడుగు ఇంటికిబోయి.. చెప్తడు. ఏం..? అమెరికల బాత్ రూం కడిగినట్లు అనుకుంటున్నావ్ నాతోని మాట్లాడుడంటే.. నేనేదో మంచిగుంటిలే.. పోనీలే హౌల పోరడు.. వీడు గాలికి తిరిగెటోడు.. ఈ గాలిగానితోని నాకెందుకని. ఇయన్నీ ఏషాలు.. ఇగ ఆ పక్కన ఓ నల్లికుట్లోడు ఉంటడు.. ఆరడుగులున్నా అనుకుంటడు, ఆని తలకాయ ఎక్కడుంటదో నాకు తెల్వద్.. కేసీఆర్ ఒచ్చి గర్జించిండట.. ఆ గర్జనకు నేనుబోయి లోపల దాక్కున్ననంట. ఇగ కేసీఆర్ గర్జనలు గర్జింనట్లు లేవుర నాయనా.. గాడిదలు ఓండ్ర బెట్టినట్లు ఉన్నది.. మీ గాండ్రిపులకు, మీ బెదిరింపులకు, ఉడుత ఊపులకు భయపడెటోడు ఎవ్వడ్ లేడు బిడ్డ.. మీరేదో తోలు దీస్తా అంటే తీపిచ్చుకోవడానికి లేము.. ఫస్ట్ మీ తోలు సంగతి జూస్కో.. ఈ తమాషా మాటలు, అతి తెలివి తేటలు కట్టిపెట్టుకో.. ఇప్పటికైన మారుండ్రి’ ఇవీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ లను ఉద్ధేశించి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్ ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ఈ సభలో ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
- నిండు మనసుతో మీరు ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకోవడం వల్లే ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు నిలబడ్డా.
- కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నా.
- చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు.
- దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందాం.
- ఎన్నికలప్పుడే పార్టీలు పంతాలు.. ఎన్నికలు ముగిసాయి.. ఇక పార్టీలు పంతాలు లేవు.
- అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోదాం.
- మన నియోజకవర్గంలో ఎవరిపై వివక్ష చూపొద్దు.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టండి.
- గ్రామ కక్షలకు తావు లేకుండా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధిచేసుకుందాం.
- కొడంగల్ వేదికగా 12,706 మంది సర్పంచులకు సూచన చేస్తున్నా..
- చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ అందిస్తా.
- ముఖ్యమంత్రి నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాది.
- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం.
- సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
- ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నాం.
- 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
- 9 నెలల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం.
- మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.
- కోటి మంది మహిళలకు కోటి చీరలు అందిస్తున్నాం.
- సంక్షేమ పథకాలు ఎవరికి అందకపోయినా సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చూసే బాధ్యత నాది.
- చదువొక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది… జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
- అందుకే పిల్లలను చదివించండి.. మీ పిల్లలు అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
- వచ్చే అకడమిక్ నుంచి చదువుతో పాటు అల్పాహారం, భోజనం అందిచే బాధ్యత నాది.
- పదేళ్ల పాలనలో కేసీఆర్ మనకు అన్యాయం చేశారు.. పాలమూరును పడావు పెట్టారు.
- పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు.
- తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు..
- పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పనులు మొదలయ్యేలా చర్యలు చేపట్టాం.
- అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు… పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులు మన ముందు ఉన్నాయి.
- నా కోపాన్ని దృష్టిలో పెట్టుకుని పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఊరుకున్నా.
- ఫామ్ హౌస్ లో బందీగా మారిన ఆయన.. వాళ్ల పాపాన వారు పోతారని ఊరుకున్నా.
- చాలా రోజుల తరువాత బయటకు వచ్చి… తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు.
- మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారు.
- సోయి లేని మాటలు.. స్థాయి లేని విమర్శలు.
- ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడలేదు.
- పదేండ్లు పాలమూరుపై పగబట్టి.. పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు.
- మటన్ కొట్టు మస్తాన్ కు చెప్తా… అక్కడకు వెళ్లి తోలు తీయ్..
- నలభై ఏండ్ల అనుభవంతో మాట్లాడే మాటలు ఇవేనా?
- మాకు మాటలు రాక కాదు… మర్యాద ఉండదని మాట్లాడటం లేదు.
- రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నాడు.. ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదు.
- నేనేం పాస్ పోర్టు బ్రోకర్ దందా చేయలేదు.. అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదు..
- మేం కక్ష రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వాళ్లే పోతారని మా పని మేం చేసుకుంటున్నాం.
- అయినా మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు.
- కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా..
- 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా.
- 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా.
- ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా.
- నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే.
- బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం.
- పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా..
- ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం.
- సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం…
- కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి.
- సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది.
- సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు.

