Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రాములోరి పెళ్లికి ఈసారి సీఎం రాక

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం భద్రాచలం పర్యటనలో వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులను ఆదేశించారు.

భద్రాచలంలోని ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి, విద్యుత్, ఆర్ డబ్ల్యూ ఎస్, శానిటేషన్, హెల్త్, రవాణా, ఫైర్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను నవమికి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు నవమి వేడుకలకు సిద్దమవుతున్న మిథిలా స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు.

శ్రీరామ నవమి ఏర్పాట్లపై భద్రాచలంలో సమీక్షా సమీవేశం నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, శ్రీరామనవమి, పట్టాభిషేకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి అధికంగా ఉన్నందున మంచినీటి కేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాలను, ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణం అనంతరం స్వామి వార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శన భాగ్యం కల్పించాలని తెలిపారు.

అదేవిధంగా ట్రాఫిక్ కు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా ముందుగానే ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచుకుని నవమి ఉత్సవాలను అట్టహాసంగా జరపాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఆర్డీవో దామోదర్ , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Popular Articles