పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తామని, అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభ వేదికగా తన సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరని, పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామన్నారు. ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామన్నారు.

దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందని, ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉందన్నారు. రైతుల శ్రమ ఎక్కడికీ పోదని, ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశామని, మొదట్లోనే 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించామని, రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్నవడ్లు పండిస్తే రూ. 500 బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సన్నబియ్యం పండిస్తున్నారని, సన్నవడ్లకు బోనస్, అత్యధికంగా రైతు రుణమాఫీ ఈ జిల్లాలోనే జరిగిందన్నారు
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ నల్గొండ ప్రాంతం చైతన్యానికి, పోరాటాలకు మారుపేరుగా సీఎం అభివర్ణించారు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా నిలబడుతుందన్నారు. ప్రజల సహకారంతో పదేళ్లలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, దేశానికి నంబర్ వన్ గా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
కాగా స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ వేదికగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ముఖ్యమంత్రి 26.10 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హుజూర్ నగర్‌కు వ్యవసాయ కళాశాల, మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కేటాయిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.