Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నిర్దయ ‘కొడుకులకు’ సీఎం రేవంత్ చెక్!

ముందు ఈ న్యూస్ క్లిప్పింగ్ చూడండి.. ‘తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కుమారులు’ శీర్షికతో ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన ఈరోజు ప్రచురించిన వార్తా కథనమిది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కుర్వ పాపమ్మకు నలుగురు కుమారులు. తమ ఆస్తులను పాపమ్మ ముగ్గురు కుమారులకు సమానంగానే పంచి ఇచ్చారు. భర్త మరణం తర్వాత పాపమ్మను ఆమె కుమారులు కొంతకాలం బాగానే చూసుకున్నారు. ఏ ఆస్తీ ఇవ్వకున్నా చిన్న కుమారుడు కూడా బాగానే చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు కన్నకొడుకులు అన్నం పెట్టడం మానేశారు. ఆర్థికంగా చితికిపోయి తల్లికి అన్నంపెట్టే స్తోమత లేక నిస్సహాయస్థితిలో చిన్న కుమారుడు ఉండిపోగా, ఆస్తి ఇచ్చినా అన్నంపెట్టని మిగతా ముగ్గురు కుమారుల నిర్దయతో పాపమ్మ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. తనకు అన్నంపెట్టని ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చిన ఆస్తిని తనపేరుపై తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని ఆమె కలెక్టర్ ను అభ్యర్థించారు.

అయిదారు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన మరో సంఘటనను చూస్తే.. తల్లి సంపాదించిన ఇంట్లోనే ఉంటూ ఆమెను గెంటేసిన కొడుకుల కథ ఇది. మూసారాంబాగ్‌కు చెందిన 90 ఏళ్ల శకుంతలాబాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. శకుంతలాబాయి భర్త చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తన ఇంట్లో కొడుకులతో కలిసి జీవిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి చేదోడువాదోడుగా ఉండాల్సిన కొడుకులు ఆమెపై నిర్దయగా వ్యవహరించారు. శకుంతలాబాయిని బలవంతంగా ఆమె ఇంటి నుంచి గెంటేశారు. దిక్కుతోచనిస్థితిలో శకుంతలాబాయి సైదాబాద్‌లోని చిన్న కుమార్తె దగ్గర ఉంటోంది.

ఈ నేపథ్యంలోనే తన ఇంటిని తిరిగి స్వాధీనం చేయాలని అభ్యర్థిస్తూ శకుంతలాబాయి సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలిసి నిరుడు ఫిబ్రవరిలో హైదరాబాద్‌ ఆర్డీవోను ఆశ్రయించారు. ఆర్డీవో ఆమె కొడుకులకు కౌన్సెలింగ్‌ చేయగా, ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు. కానీ నెలలు గడిచినా ఇల్లును మాత్రం ఖాళీ చేయలేదు. తాజాగా సైదాబాద్‌ తహసీల్దార్‌ జయశ్రీ ఈ ఘటనపై విచారణ జరిపి శకుంతలాబాయి కుమారులకు తుది నోటీస్‌ జారీ చేశారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కానీ ఎమ్మార్వో నోటీసును సైతం వాళ్లు ఖాతరు చేయలేదు.

దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో గత గురువారం సిబ్బందితో తహసీల్దార్‌ జయశ్రీ అక్కడికి వెళ్లగా అప్పటికే శకుంతలాబాయి కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అనివార్యంగా రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జయశ్రీ మాట్లాడుతూ, తల్లిదండ్రులను చూడని పిల్లలకు వారి ఆస్తిపై హక్కు లేదని, ఎవరైనా వారిని మోసం చేస్తే సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకొని వారి ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టని సంతానపు తాలూకు ఘనకీర్తి గురించి ఇటీవలి కాలంలో ఇటువంటి అనేక వార్తలు వెలువడతున్నాయి. ఈ రెండు సంఘటనలు ఉదాహరణ మాత్రమే.

శకుంతలాబాయి ఘటనలో ఇల్లును ఎమ్మార్వో జయశ్రీ సీజ్ చేసినప్పటి చిత్రం

ఈ నేపథ్యంలోనే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త యోచనను పదును పెడుతుండడం విశేషం. నిర్లక్ష్యానికి గురవుతున్న త‌ల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులు ప‌ట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాల్సి ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటువంటి ఘటనల్లో బాధితుల సంతానం ఉద్యోగులైతే వారి వేత‌నాల నుంచి నేరుగా వారి త‌ల్లిదండ్రుల‌కు ఖాతాల‌కు 10 నుంచి15 శాతం జ‌మ అయ్యే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. ఇప్పటికే ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఇటువంటి విధానం అమలవుతోందని, ఈ అంశంలో సమగ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ‌, దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, ట్రాన్స్‌జెండ‌ర్ల సాధికారిత శాఖ‌ల‌పై ఉన్నతాధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం.

గద్వాల జిల్లాకు చెందిన పాపమ్మ, హైదరాబాద్ లోని మూసారంబాగ్ కు చెందిన శకుంతలాబాయి ఘటనలను చూసినపుడు సీఎం తన ఆలోచనను అమలు చేస్తే సంతానపు నిరాదరణకు గురైన తల్లిదండ్రుల మదిలో వాళ్ల తుదిశ్వాసవరకు రేవంత్ రెడ్డి గుర్తుండిపోతారనడంలో అతిశయోక్తి లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల అంశంలోనే కాదు, ప్రయివేట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ ప్రతిపాదనలో మరింత లోతుగా చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరముందనే అభిప్రాయాలు బాధిత వృద్ధుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన త్వరలోనే ఆచరణలోకి రావాలని బాధిత తల్లిదండ్రులు అనేక మంది అభిలషిస్తుండడం ఆత్యాశ కాకపోవచ్చు.

Popular Articles