మేడారంలో వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శనం చేసుకునే అంశంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వాడుకలో గల ‘సెంటిమెంట్’ను బ్రేక్ చేశారు. అయితే ఈ సెంటిమెంట్ గురించి అటు పూజారులుగాని, ఇటు మంత్రి సీతక్క కూడా ముఖ్యమంత్రికి గుర్తు చేయలేదా? అనే చర్చ కూడా ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తుల్లో జరుగుతోంది. ఇంతకీ మేడారం వనదేవతల దర్శనం విషయంలో గల సెంటిమెంట్ ఏమిటంటే..?
సాధారణంగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు ప్రీతిపాత్రమైన రోజులు బుధ, గురు, శుక్రవారాలు మాత్రమే. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతోపాటు మధ్యలో జరిగే మినీ జాతర తేదీలు కూడా ఆయా వారాల్లోనే వస్తాయి. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లులు జాతర సమయంలో గద్దెలపై ఆసీనులవుతారు. శుక్రవారం భక్తులు మొక్కులను అప్పగిస్తారు. శనివారం వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. తెలుగు నెలల ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి వేళ.. ప్రతి జాతరలో, మినీ జాతరలో ఖరారయ్యే తేదీలు ఖచ్చితంగా ఆయా వారాల్లోనే ఉంటాయి.

జాతర సమయాల్లోనే కాదు, సాధారణ రోజుల్లోనూ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి వచ్చి వనదేవతలను దర్శించుకుంటుంటారు. మారిన పరిస్థితుల్లో నిత్య జాతరగా మారిన మేడారానికి ఎక్కువగా ఇవే వారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ, వారాంతపు సెలవుల కారణంతో పిల్లా, పాపలతో కలిసి అనేక కుటుంబాలు ఆదివారం కూడా మేడారానికి రావడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అయితే మంగళవారం, శనివారం మాత్రం అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికీ భక్తులు పెద్దగా సుముఖతను వ్యక్తం చేయరు.
వనదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే ఎక్కువగా భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లిస్తారు. కానీ మేడారం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అమలు చేసే ప్రక్రియలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి సెంటిమెంట్ కు విరుద్ధంగా మేడారంలో పర్యటించడం విశేషం. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, తన ఎత్తు తూగిన 68 కిలోల బంగారాన్ని (బెల్లం) కూడా తల్లులకు సీఎం మొక్కుబడిగా చెల్లించుకున్నారు. దీంతో మేడారం వనదేవతల దర్శనానికి ‘ఘాతవారం’గా భక్తులు భావించే మంగళవారం రోజు సీఎం రేవంత్ మేడారంలో పర్యటించి సెంటిమెంట్ ను బ్రేక్ చేశారనే చర్చ జరుగుతోంది. అయితే దేవతల దర్శనానికి వారం, వర్జ్యాలంటూ ఉండవని పురోహితులు చెబుతుంటారనేది వేరే విషయం.

