హైదరాబాద్: మేడారం జాతర తరహాలో తెలంగాణాలో బంజారాల పుణ్యక్షేత్రం నిర్మితం కానుంది. నల్లమల అటవీ ప్రాంతలో నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.
ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా జాతర, మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతర పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని సీఎం అన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ పొరిక బలరాం నాయక్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆయా ప్రకటన చేశారు.

