‘పొగడ్తలు అంటే గిట్టని వ్యక్తి మీరొక్కరే సర్’ అంటే చాలు ఎటువంటి వ్యక్తి అయినా ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. తాను పొగడ్తలకు పడిపోనని లోకం గుర్తించిందని తెగ మురిసిపోతుంటాడు., ముచ్చట పడుతుంటాడు కూడా. నిజానికి పొగడ్తలకు పడిపోని మనుషులెవరూ ఉండరనేది ఓ నానుడి. కాకపోతే ఇందులోనూ నిష్ఫత్తి ఉంటుందని కూడా పలువురు నిర్వచిస్తుంటారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తలకు పడిపోతారో లేదో తెలియదుగాని, ఇటీవలి కాలంలో ఓ సెక్షన్ మీడియా తెగ భజన చేస్తోందని చెప్పక తప్పదు. ఈ భుజకీర్తుల భజన ఏ స్థాయి వెళ్లిందంటే..
ఈ కథనంలోని ఫీచర్ ఇమేజ్ (ఫొటో)లోని ఆయా వార్తా కథనాల హెడ్డింగులను ఓసారి నిశితంగా పరిశీలించండి. ‘రేవంత్ రెడ్డి డేరింగ్ స్టెప్, బీసీ ఛాంపియన్ రేవంత్ రెడ్డి, రేవంత్ కు మద్దతు ఇవ్వకుంటే మొదటికే మోసం, పే..ద్ద టాస్క్, రేవంత్ రెడ్డి సాధించాడు. రేవంత్ రెడ్డి సంకల్పానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఛాన్స్ ఇస్తున్నాడు’ బాగున్నాయి కదా.. శీర్షికలు? ఇటువంటి అనేక హెడ్డింగులతో సోషల్ మీడియా వేదికగా కొందరు ‘సైటు’గాళ్లు తెగ ఊదరగొడుతున్నారు. ‘సైటుగాళ్లు’ అనే పదం వాడడంలో అనుచితం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆ పదం అటువంటి ‘సైటు’గాళ్లు సృష్టించిన భాష నుంచి తీసుకున్నదే కాబట్టి.

అధికారంలో ఉన్నవారిని కీర్తిస్తూ ఇటువంటి సైటుగాళ్ల భజన ఏ స్థాయికి చేరిందంటే.. రేవంత్ రెడ్డికి వరుణుడి కరుణ కూడా పుష్కలంగా ఉందట. కరెంటు ఉత్పత్తికి, నీటి పారుదల రంగానికి, వ్యవసాయానికి సానుకూల ఫలితాన్నిస్తూ వరుణుడు రేవంత్ రెడ్డిపై కరుణను మొంథా ‘తుపాన్’లా కురిపిస్తున్నాడనేది భజన సైటుగాళ్ల వార్తా కథనాల సారాంశం. సరే ఎవరి సైటు వాళ్లిష్టం. కానీ ఈ భజన వార్తా కథనాల వెనుక అసలు ‘కత’ వేరే ఉందనేది అధికార పార్టీపై మీడియా సర్కిళ్లలో జరుగుతున్న భిన్న ప్రచారం. ఈ ప్రచారంలోని ఆసక్తికర అంశమేమిటంటే..?
మెయిన్ స్ట్రీమ్ మీడియా సంగతి వదిలేయండి. ఎందుకంటే ప్రింట్ మీడియా ఖర్చులు, ప్రభుత్వ ప్రకటనల ఆబ్లిగేషన్ తదితర వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. వాటి వార్తా కథనాల తీరు వేరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మరీ ఇంతలా తెగబడి భజన చేస్తున్న దాఖలాలు కూడా తక్కువే. కానీ సోషల్ మీడియాకు చెందిన కొందరు ‘సైటు’గాళ్లు ఇంతలా భజన చేయడం వెనుక భిన్న కథనాలు వినిపిస్తుండడమే అసలు విశేషం.

అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన పబ్లిసిటీ వింగ్ టీం తాము ఎంపిక చేసుకున్న వారికి నెల నెలా పేమెంట్స్ ప్రాతిపదికన ఇటువంటి వార్తా కథనాలు రాయిస్తున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించి మరో కోణంలోనూ భిన్న కథనం వినిపిస్తోంది. సర్కారు వారి ‘పెయిడ్ ఆర్టికల్స్’ ఆలోచన ఇంకా ప్రతిపాదనలోనే ఉందని, ఇంకా కార్యరూపం దాల్చలేదని, పాలకులను మచ్చిక చేసుకునే ప్రక్రియలో భాగంగా కొందరు సైటుగాళ్లు ఇటువంటి భజన రాతల కథనాలను జనంలోకి విరివిగా వదులుతున్నారనేది మరో ప్రచారం.
ఇందులో నిజా, నిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని ఈ తరహా మీడియా తమ భజన వార్తా కథనాల ద్వారా ‘మునగ చెట్టు’ను ఎక్కిస్తోందనే వ్యాఖ్యలు కూడా లేకపోలేదు. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. ఇదే తరహా మీడియా గతంలోనూ కేసీఆర్ సారుకు ‘శోష’ వచ్చేలా తెగ భజన చేశాయి. గత ఎన్నికల్లో గులాబీ బాస్ పవర్ పోయే సరికి, గొంతు మార్చి అంతటి కేసీఆర్ కు సిగ్గూ, శరం లేదనే పరుష వ్యాఖ్యలతో వార్తా కథనాలను వండి వారుస్తూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో పడేందుకు తెగ శ్రమిస్తున్నారనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. అధికార పార్టీ ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని ఆశిస్తూ రాస్తున్న ఆర్టికల్స్ గా మీడియా సర్కిళ్లలో ఇటువంటి కథనాలపై ప్రచారం జరుగుతోంది. అందుకే కాబోలు ఈ తరహా రాతగాళ్లను ట్యాగ్ చేస్తూ మరీ అదే సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్య ఏమిటో తెలుసా..?
‘వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుందిరా ఏబ్రాసి వెధవ.. భజన చేసేందుకు ఏం దొరకలేదా..? బైపోల్ ఉంది, ఒక్కొక్కడు చిడతలు పట్టుకొని బయటికొచ్చిర్రు.. ఎన్నడో ఒకనాడు రేవంత్ అన్న మీలాంటి వాళ్లను బట్టలిప్పి కొడతాడు’ అంటూ తెలంగాణా సీఎంకు తెగ భజన చేస్తున్నవారిని ట్యాంగ్ చేస్తూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

అన్నట్టు సీఎం రేవంత్ సారూ..! గత ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముగిసిందే తడవుగా ‘రేవంతూ.. నీకంత సీన్ లేదు.. ఊహల్లో తేలిపోకు.. ముచ్చటగా మూడోసారి కూడా మా కేసీఆర్ సారే కింగ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టింది కూడా ఇప్పుడు మీకు భజన చేస్తున్న కొందరు రాతగాళ్లే. అయినప్పటికీ ‘మొంథా’ తుపాన్ ను సైతం వెక్కిరిస్తున్నట్లుగా భజన చేస్తున్న ఇటువంటి రాతలే మహా ఇంపుగా ఉన్నాయని మీరు సంతోషిస్తే చేసేదేమీ లేదనేది వేరే విషయం.
కానీ బతుకుదెరువు కోసం అవసరార్థం గొంతుమార్చే ఇటువంటి భజన రాతగాళ్ల వల్ల మాత్రం మీరు గత ఎన్నికల్లో గెలవలేదనేది నిప్పులాంటి నిజం. ఎందుకంటే అప్పటి ఎన్నికల గెలుపులో మీ కష్టం, పార్టీ కార్యకర్తల వెలకట్టలేని త్యాగం ఉందనేది కాదనలేని వాస్తవం. ఇటువంటి భజన రాతలేవీ మిమ్మల్ని గద్దెనెక్కించలేదనేది కూడా అంతే వాస్తవం. వచ్చే ఎన్నికల్లో ఈ తరహా భజన రాతలు మీకు ఉపయుక్తం కూడా కాకపోవచ్చు. మీ పాలన మాత్రమే మీ తదుపరి గెలుపునకు గీటురాయి. ఇదీ చెప్పదల్చుకున్న అసలు సంగతి.
– ✍ ఎడమ సమ్మిరెడ్డి

