Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సీఎం బంధువుల కిడ్నాప్ ఘటనలో కీలక విషయాలు

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్ ఘటనలో ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు బయటకు వచ్చినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, ఏవీ సుబ్బారెడ్డిల ప్రమేయం ఈ కిడ్నాప్ ఉదంతంలో ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కిడ్నాప్‌ కేసులో ఏ-1గా సుబ్బారెడ్డి , ఏ-2గా భూమా అఖిలప్రియ, ఏ-3గా భార్గవరామ్​లను నమోదు చేసినట్లు తెలిపారు. కూకట్‌పల్లిలోని ఇంట్లో ఉదయం 11 గంటలకు అఖిలప్రియను అరెస్టు చేశామని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.

నిన్న రాత్రి బోయిన్‌పల్లి పరిధిలో కిడ్నాప్‌ ఘటన జరిగిందని, ఐటీ అధికారుల పేరుతో దుండగులు ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చారన్నారు. అనంతరం ముగ్గురు సోదరులైన ప్రవీణ్‌, సునీల్‌, నవీన్‌ లను కిడ్నాప్ చేశారని, వాహనంలో ముగ్గురిని తీసుకెళ్లారని సీపీ తెలిపారు. ఈ సమయంలో ఇంట్లోనే గల మహిళలు, పిల్లలను ఒక గదిలో బంధించారని, కిడ్నాప్‌ జరిగిన గంట తర్వాత పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. కిడ్నాప్‌ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీపీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను అరెస్ట్​ చేస్తామని, కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించామన్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ గురైనవారు తెలంగాణా సీఎం కేసీఆర్ బంధువులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఓ భూ వివాదమే కారణం కావడం గమనార్హం.

Popular Articles