(సమీక్ష ప్రత్యేక కథనం)
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఎక్కడైనా నిర్వహించుకునే అధికారం, హక్కు పాలకులకు ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ మీటింగ్ నిర్వహించవచ్చు.. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 240 కి.మీ. దూరంలో గల ములుగు జిల్లా మేడారం గ్రామంలో తెలంగాణా కేబినెట్ భేటీ కానుంది. ఈనెల 18వ తేదీన జరిగే ఈ సమావేశాన్ని మేడారంలో నిర్వహించి పలు కీలకాంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇదే అసలు విశేషం.
సీఎం విదేశీ పర్యటన, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యం, మహాజాతర ఆధునికీకరణ పనుల ప్రారంభం నేపథ్యంలోనే మేడారం కేంద్రంగా కేబినెట్ మీటింగ్ జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. కానీ మేడారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్ వెనుక ప్రభుత్వ అసలు లక్స్యం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. అదేమిటో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లక తప్పదు..
‘‘ఏటూరునాగారం అభయారణ్యంలో తుపాకులగూడెం వెళ్లే మార్గం. ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీరభ్ కుమార్ ప్రసాద్ ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసినప్పటి కాలం. బహుషా 1991-92 సంవత్సరం కాబోలు. ఐటీడీఏ పీఆర్వో సలీమ్ భాయ్, ఈనాడు రిపోర్టర్ గా నేను ఐటీడీఏకు చెందిన మహీంద్రా కమాండర్ జీపులో ప్రయాణిస్తున్నాము. డ్రైవర్ లింగయ్య డ్యూటీ చేసే కమాండర్ జీపులో ఎప్పుడు ప్రయాణించినా స్టీరింగ్ అతను నాకే అప్పగించేవాడు. అందువల్ల నేనే స్వయంగా జీపు నడుపుతున్నాను. ఇప్పుడున్నటువంటి తారు రోడ్డు మార్గం కాదది. అంతా ఇసుకతో కూడిన మట్టి రోడ్డే. ముందు సీట్లో ఎడమ వైపు నా పక్కనే పీఆర్వో సలీమ్ భాయ్ కూర్చున్నాడు. ముప్పనపల్లి సమీపానికి జీపు చేరుకోగానే ఉన్నట్టుండి ‘అరె భయ్యా.. అన్నల గుంపును చూడు. ఎదురుగ ఒస్తున్నరు.. రోకో రోకో.. గాడీ రోకో.. తిప్పు.. బండీ తిప్పు..’ అని సలీమ్ భయంతో కూడిన ఆందోళనగా చెబుతున్నాడు. వాస్తవానికి దూరంగా నడిచివస్తున్న సుమారు 30-40 మంది నక్సల్స్ ను నేను అప్పటికే గమనించాను. సలీమ్ భాయ్ లోని భయాన్ని చూసి ‘ఏం కాదులే భయ్యా.. నువ్వు ఆగు’ అని సముదాయించాను. కాస్త ముందుకు వెళ్లగానే చేయి అడ్డుగా పెట్టి జీపును ఆపాలనే సంకేతాన్ని ఇచ్చారు నక్సల్స్. నేను బ్రేక్ వేసి జీపును ఆపగానే ఓ నక్సల్ ఒకరు ముందుకు వచ్చి వెహికిల్ ముందు గల బంపర్ పై కాలు వేసి, బాయ్ నెట్ పై చేయి తో కొడుతూ బండి దిగాలని సైగ చేశాడు. అప్పటికే సలీమ్ భాయ్ గజగజ వణికపోతున్నాడు. వెనకాల కూర్చున్న ప్రభుత్వ డ్రైవర్ లింగయ్య మాత్రం కాస్త ధీమాగానే ఉన్నాడు. డ్రైవింగ్ సీటు నుంచి కిందకి దిగిన నేను జీపు బంపర్ పై కాలు వేసిన నక్సల్స్ వద్దకు వెళ్లి ‘ అన్నా చెప్పు.. ఏంది?’ అన్నాను. ఎవరు మీరు.. సర్కార్ జీపు ఇది.. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగా? అని ప్రశ్నించాడు. ‘చలమన్న ఉన్నడా అన్నా..?’ అని జీపుపై కాలు వేసిన నక్సల్ ను అడిగాను. ఈలోగా ప్రధాన మార్గంలో కాకుండా రోడ్డు పక్కనే అడవిలోని చెట్ల మధ్యనుంచి నడుస్తూ ఏకే-47 ధరించిన చలమన్న జీపు వద్దకు వచ్చాడు. నన్ను చూసి ‘యాడికి బోతానవ్ సమ్మన్నా..’ అని ప్రశ్నించారు. కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాల స్థితిగతులపై వార్త రాయడానికి వెడుతున్నాను అన్నా.. అని నేను చెప్పాను. ఇలా కాసేపు కుశల ప్రశ్నలతో మాట్లాడిన తర్వాత చలమన్న దళానికి వీడ్కోలు పలికి కన్నాయిగూడెం బయలుదేరాం. కొద్ది దూరం వెళ్లాక సలీమ్ భాయ్ తేరుకుని మాట్లాడుతూ, ‘అరే.. అన్నా నువ్వు అంత ధైర్యంగా ఉన్నావేంది? జీప్ తగ్లబెడ్తరని ఫికర్ పడ్డ తెలుసా?’ అన్నాడు. అప్పట్లో ప్రభుత్వ వాహనం కనిపిస్తే పీపుల్స్ వార్ నక్సల్స్ దగ్ధం చేసే పరిస్థితులు ఉండేవి. అయితే ‘పొడుగు లాగు’లతో కనిపించిన ప్రతిఘటన నక్సల్స్ ఇటువంటి చర్యలకు పాల్పడరనే విషయం సలీమ్ భాయ్ కు తెలియదు.. నాకు తెలుసు.. కాబట్టి నేను పెద్దగా ఆందోళన చెందలేదు. ఇప్పుడీ ఈ ఫ్లాష్ బ్యాక్ ప్రస్తావన దేనికంటే..!’’
అప్పట్లో ప్రధాన రహదారుల్లోనే నక్సల్స్ యధేచ్చ సంచారానికి సంబంధించిన మూడున్నర దశాబ్ధాలనాటి వాస్తవిక దృశ్యమిది. ములుగు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్ట్ పార్టీ, చండ్ర పుల్లారెడ్డి గ్రూపునకు చెందిన ఫణిబాగ్చి, రామచంద్రన్ వర్గాలకు పెట్టని కోటలుగా ఉన్న ప్రాంతాలు అవి. ఏటూరునాగారం నుంచి మహదేవపూర్ వరకు, తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట వంటి మండలాల్లో గ్రామాలవారీగా వివిధ నక్సల్స్ గ్రూపులు ప్రాబల్యాన్ని కలిగి ఉండేవి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఓవైపు జంపన్న, ఇంకోవైపు సత్తెన్న, ప్రసాదన్న, చలమన్న, మంగన్న వంటి కీలక నక్సల్ నాయకులు తమ దళాలతో సంచరించిన ప్రాంతాలు. ఏటూరునాగారం దండకారణ్యం వివిధ నక్సల్స్ గ్రూపులకు స్థావరంగా, పెట్టని కోటలుగా భాసిల్లిన కాలం అన్నమాట.

సంచలనాత్మక చెల్పాక మందుపాతర, మేడారం చెరువులో జంపన్న భార్య శారదక్క తదితరుల ఎన్కౌంటర్, ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పై రాకెట్ లాంఛర్లతో దాడి, చింతగూడెం వద్ద బస్సు పేల్చివేత వంటి ఘటనలు చోటు చేసుకున్న పరిణామాలు. ఈ నేపథ్యంలోనే ఏటూరునాగారం దండకారణ్యాన్ని 1990 దశకంలో అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ ‘గెరిల్లా జోన్’ గా ప్రకటించుకుంది. ఈ గెరిల్లా జోన్ లో పీపుల్స్ వార్ పార్టీకి పెట్టని కోటలుగా చెల్పాక, షాపల్లి, కన్నాయిగూడెం, తుపాకులగూడెం, దొడ్ల, మల్యాల, మేడారం, ఊరట్టం, కాల్వపల్లి తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లో నెలల తరబడి పీపుల్స్ వార్ నక్సల్స్ ‘మకాం’ వేసినా పోలీసులకు ఏమాత్రం సమాచారం ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.
ఇటువంటి విప్లవోద్యమ కార్యకలాపాలకు నెలవైన అప్పటి మేడారం ప్రాంతంలో తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 18న తెలంగాణా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పర్యటన ముగిశాక సాయంత్రానికల్లా మేడారం చేరుకునే సీఎం సహా మంత్రివర్గం అక్కడే సమావేశమై మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సహా మరికొన్ని ముఖ్యాంశాలపై చర్చించునుంది. నిజానికి ఈ అంశాలపై చర్చించడానికి సీఎం రేవంత్ తన మంత్రివర్గంతో హైదరాబాద్ లోనూ సమావేశం కావచ్చు. విదేశీ పర్యటనకు వెడుతున్నప్పటికీ, తీరిక లేని టూర్ షెడ్యూల్ ఉన్నప్పటికీ సీఎం తలచుకుంటే కేబినెట్ మీటింగ్ ను రాష్ట్ర సచివాలయంలో ఓరోజు ముందుగానే జరుపుకోవచ్చు.

కానీ మేడారంలోనే నిర్వహించడం వెనుక ఆసక్తికర కోణం కూడా ఉందని చెప్పక తప్పదు. తెలంగాణా రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగైనట్లేనని చెప్పకనే చెప్పే ఉద్దేశం కావచ్చు. ఆదివాసీ గిరిజనుల ముంగిట్లోకి కేబినెట్ వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వడం కూడా కావచ్చు. గిరిజనుల ఆరాధ్య వనదేవతలు సమ్మక్క-సారలమ్మల మహా జాతర భక్తుల చెంతకే తమ ప్రభుత్వం వచ్చిందని స్పష్టీకరించడం కావచ్చు. ఇటువంటి అనేక అంతర్లీన అంశాలు మేడారంలో జరిగే కేబినెట్ మీటింగ్ వెనుక దాగి ఉన్నాయనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన, జనశక్తి వంటి నక్సల్స్ గ్రూపుల కదలికలేవీ అక్కడ లేవు. కానీ మావోయిస్ట్ పార్టీ తెలంగాణా కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు స్వగ్రామం కాల్వపల్లి మేడానికి సుమారు 5 కి.మీ. దూరంలోనే ఉండడం గమనార్హం. మొత్తంగా పరిశీలించినపుడు మేడారం అనే ఓ కుగ్రామంలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరడమనేది చారిత్రక ఘట్టమనే చెప్పాలి. కాగా మేడారం వన దేవతల సన్నిధిలో జరిగే కేబినెట్ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆలయ ప్రాంగణ పనులను వేగంగా వెంటనే పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

✍️ ఎడమ సమ్మిరెడ్డి

