Top 5 This Week

Related Posts

తెలంగాణా బడ్జెట్ రూ. 3,24,234 కోట్లు

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ. 3,24,234 కోట్లుగా ఖరారైంది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకి నడిపించే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు.

బడ్జెట్ ప్రధానాంశాలు:
2వ తేదీ 2026 నుంచి రాష్ట్రంలో సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందించడం.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇకపై కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం. విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక సరికొత్త అధ్యాయానికి నాంది. 🔹 రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరణ. ఉద్యోగావకాశాలు కల్పించడం, ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదగడానికి వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 15 కోర్సులను ప్రారంభం.

  • ఇవీ కేటాయింపులు:
  • చేయూత పథకం కింద అర్హులైన వారికి కొత్తగా 2 లక్షల పెన్షన్ల మంజూరు.
  • మహాలక్ష్మి పథకంలో ప్రతిరోజూ రాష్ట్రంలో 34.37 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం. ఇప్పటివరకు వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269.68 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయడం ద్వారా ఆదా అయిన మొత్తం రూ. 9,222 కోట్లు.
  • మహిళలకు ఉపశమనం కల్పించేందుకు ప్రారంభించిన రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం వల్ల 42.90 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుండగా, తద్వారా మహిళలకు రూ. 752 కోట్లు ఆదా.
  • గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించడం వల్ల దాదాపు 53.9 లక్షల పేద, మధ్య తరగతి కుటుంబాలకు 10.97 కోట్ల మేరకు సున్నా బిల్లులు జారీ కాగా అందుకు 3,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది.
  • మహిళా శక్తి మిషన్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పం.
  • తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి అత్యంత ప్రాధాన్యత.
  • ౩౦ వేల ఏకరాల్లో చారిత్రాత్మకమైన భారత్ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం. ఫ్యూచర్‌ సిటీతో అనుసంధానంగా మచిలీపట్నం పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి.
  • తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 కు అనుగుణంగా, టెక్నాలజీ, ఏఐ, జీసీసీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టార్టప్‌, ఫైనాన్షియల్ సర్వీస్‌ సంస్థలకు అధిక విలువైన కేంద్రంగా కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి పరచడం. ఓఆర్‌ఆర్‌ వెలుపల రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) లోపలున్న మధ్య భాగంలో తయారీ రంగ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం. ఆర్‌ఆర్‌ఆర్‌ అవతలి భాగంలో ఫుడ్ ప్రాజెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి.
  • రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ఎకరాకు 6 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏటా 12 వేల రూపాయల సహాయం. రైతులకు అండగా నిలవడానికి సన్నవడ్లకు క్వింటాకు రూ. 500 చొప్పున బోస్‌. మొత్తంగా రైతు సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించింది రూ. 23,179 కోట్లు.
  • ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 3.18 కోట్ల లబ్దిదారులకు రేషన్ షాపుల ద్వారా 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించబడుతోంది. 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పౌర సరఫరాల శాఖకు రూ. 7,366 కోట్లు.
  • విద్యుత్ రంగం కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ది, భావి తెలంగాణకు పునాదిగా భావించింది. రాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో, ప్రతి వ్యక్తికి వినియోగం 2508 యూనిట్లు ఉండగా దేశ సగటుకంటే చాలా ఎక్కువగా నమోదైంది. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అమలు చేస్తూ నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ శాఖకు బడ్జెట్‌లో రూ. 21,285 కోట్లు.
  • విద్యా రంగానికి రూ. 26,674 కోట్లు. యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుదైక కుటుంబంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులంతా ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో రాష్ట్రంలో 105 పాఠశాలలు నిర్మాణం.
  • ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని 2 వేల నుంచి 2500 పాఠశాలలకు విస్తరణ.
  • ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించింది.
  • దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో తెలంగాణ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.
  • వైద్య, ఆరోగ్య రంగానికి రూ. 13,679 కోట్లు. పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే లభించే ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ తయారుచేయడం.
  • రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా మరో 1980 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందులోకి తెస్తాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం.
  • ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. దీని ద్వారా 23.51 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు లబ్ది. ఉద్యోగుల భద్రత కోసం తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకం.
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ. 22,615 కోట్లు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల, రాజీవ్ భీమా ఎత్తిపోతల, మక్తల్, నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, డిండి, దేవాదుల, సీతారామ, గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్లను చేపట్టడం.
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 12,789 కోట్లు. హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ రోడ్లను అభివృద్ధికి ప్రతిపాదనలు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు దానికి సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు. నూతన విమానాశ్రయాల అభివృద్ధి.
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 17,907 కోట్లు. మూసీ నది పునరుద్ధరణ కోసం మొదటి దశ ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి నుంచి 2.5 టీఎంసీ నీటిని తరలించడమే కాకుండా మరో 39 ఎస్టీపీల నిర్మాణం.
  • హోం శాఖకు రూ. 11,907 కోట్లు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యనత. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం. నక్సలిజంపై మూలలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే సమస్య పరిష్కరించవచ్చన్న నమూనా అమలు.
  • పన్నెండేళ్లకు ఒకసారి జరుపుకునే పవిత్ర గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న నేపథ్యంలో వాటి నిర్వహణ కోసం అత్యద్భుతంగా ఏర్పాట్ల కోసం బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయింపు.

Popular Articles