తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లీగల్ నోటీసు పంపారు. రోహిత్ వేముల అత్మహత్యోదంతంలో తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క బేషరతుగా మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని రామచందర్ రావు తన నోటీసులో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రూ. 25 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తానని, క్రిమినల్ కేసును కూడా ఎదుర్కోవలసి ఉంటుందని రామచందర్ రావు పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచందర్ రావు ఎన్నికైన సందర్భంలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణమని, దళితులను, గిరిజనులను వేధించినవారికి బీజేపీ ఉన్నత పదవులను కట్టబెడుతున్నదని భట్టి వ్యాఖ్యానించారు. రామచందర్ రావు నియామకంపై బీజేపీ పునరాలోచన చేయాలని కూడా భట్టి కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామచందర్ రావు తన న్యాయవాది విజయకాంత్ ద్వారా భట్టికి లీగల్ నోటీసు పంపారు. ఈ అంశంలో డిప్యూటీ సీఎం భట్టి ఎలా స్పందిస్తారో చూడాలి.
