Top 5 This Week

Related Posts

కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ

ఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రులతో తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ ఖరీప్ సీజన్‌లో ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు ఏర్పడిన యూరియా లోటు 2 లక్షల‌ టన్నులను ఈ నెలలోనే భర్తీ చేయాలని తుమ్మల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్ లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ముందుగానే రైతులకు ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చెయ్యాలని కోరారు. జియో పొలిటికల్ కారణాల వల్లనే సరఫరాలో‌ ఇబ్బందులు ఎదురయ్యాయని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు‌ కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై చర్చ:
అనంతరం కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కె. రాంమోహన్ నాయుడుతో తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజిబిలిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని, అక్కడ త్వరగా ఫీజిబిలిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడును తుమ్మల కోరారు.

కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా, విద్యాపరంగా, పర్యాటక పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. తెలుగు బిడ్డ రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

Popular Articles