Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

బీసీల పుట్టి ముంచిన ‘తీన్మార్’ కుల ద్వేషం!

‘కులం పునాదుల మీద దేనినీ సాధించలేం.. ఒక జాతిని, నీతిని నిర్మించలేం..’ అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ హితవు మరోసారి నిరూపణ అయినట్లేనా? ఇతర కులాలను ద్వేషిస్తూ సంస్కార హీనతను ప్రదర్శించే ఎమ్మెల్పీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనబడే బీసీ వాది వ్యవహారశైలి వెనుకబడిన కులాలకు తీరని నష్టం చేసిందా? తెలంగాణా రాష్ట్రంలో జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి ఇదే అంశాన్ని ధ్రువపరుస్తోందా? ఇవీ తాజా ప్రశ్నలు.

ఇతర కులాలను ద్వేషించడమే రాజకీయ ఎత్తుగడగా, తనకు అండగా నిలిచిన నాయకులను అవసరం తీరాక బండ బూతులు తిడుతూ ప్రముఖంగా వార్తల్లో నిలిచే చింతపండు నవీన్ గత కొన్ని రోజులుగా జనాలకు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈనెల 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత చివరికి తన యూ ట్యూబ్ ఛానల్ లోనూ చింతపండు నవీన్ వీక్షకులకు కూడా కనిపించినట్లు లేదు. కులగణన సర్వే ప్రతులను తన ఛానల్ లైవ్ ప్రసారాల్లో నిప్పంటించి దహనం చేసిన ‘తీన్మార్’ చర్యకు ప్రతిచర్యగా కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత మల్లన్న ఐదు రోజులుగా వార్తల్లో అదృశ్యమయ్యాడనే చెప్పాలి.

నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత తన పిలుపునకు, వాదనకు గట్టి బలముందని చెప్పే ప్రక్రియలో భాగంగా ‘తీన్మార్ లీడర్’ బయటకు వస్తారని అతని అభిమానులు భావించారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు తమ యూ ట్యూబ్ ఛానల్ లో కనిపించవచ్చని కూడా అతని శిష్యులు సూచనప్రాయంగా వెల్లడించారు. కానీ పరిస్థితులు తిరగబడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ‘తీన్మార్ లీడర్’ కు ఏమాత్రం ఆశాజనకంగా వెలువడలేదు.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను మద్ధతు ప్రకటించిన పూల రవీందర్ గట్టెక్కలేదు. పైగా తాను ద్వేషించి, దూషించిన ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. తాను పుట్టి పెరిగిన నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఈ ఫలితం ‘తీన్మార్ లీడర్’ కు శరాఘాతంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ‘తీన్మార్ లీడర్’ వెనకుండి మద్దతు ప్రకటించిన ప్రసన్న హరిక్రిష్ణ కూడా ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేటయ్యే పరిస్థితి ఏర్పడింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన మూడో స్థానంలోకి వెళ్లడమే ఇందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు.

ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

నిజానికి అటు నల్లగొండ టీచర్స్, ఇటు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులైన పూల రవీందర్, ప్రసన్న హరిక్రిష్ణలకు సామాజికపరంగానేకాదు, ఇతరత్రా కోణాల్లోనూ పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటమి చెందడానికి ‘తీన్మార్ లీడర్’ కులద్వేష వైఖరి భారీ నష్టాన్ని కలిగించిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సమయంలోనే పలువురు పోలింగ్ ఏజెంట్లు తమ జేబుకు ధరించిన పాస్ లను మధ్యలోనే తొలగించాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయంటున్నారు. కొన్ని కులాలను టార్గెట్ గా చేసుకుని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పూల రవీందర్ కు భారీ నష్టాన్ని కలిగించాయంటున్నారు.

అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన ప్రసన్న హరిక్రిష్ణకు సైతం ఇదే తరహా నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు బీఆర్ఎస్ లీడర్లు తమ ఎత్తుగడలద్వారా వేర్వేరు మార్గాల్లో అతనికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య సులభతరంగా నెగ్గాల్సిన ప్రసన్న హరిక్రిష్ణ చివరికి మూడో స్థానంలో నిలవడానికి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ‘కుల’ ద్వేషమే ప్రధాన కారణమంటున్నారు. కొన్ని కులాలను దూషించడం ద్వారా బీసీ వాదాన్ని గెలిపించాలనే చింతపండు నవీన్ ఎత్తుగడ బెడిసికొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అంజిరెడ్డి

మొత్తంగా పరిశీలించినపుడు అటు టీచర్స్, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో అనుకూల ఫలితాలను అంచనాలను వేసుకున్న తీన్మార్ మల్లన్నకు తాజా పరిస్థితి శరాఘాతంగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మల్లన్న దుందుడుకు ఎత్తుగడలు, అనుభవరాహిత్య వ్యూహాలు, కులద్వేష మేథస్సు ఫలితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల పుట్టి ముంచినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే.. రాజకీయంగా ఇప్పుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అడుగులెటు..? ప్రభుత్వంలో కీలక భూమికలో గల ఓ మంత్రి పీఆర్వో అన్యాపదేశంగా చెప్పిన ప్రకారం.. పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మల్లన్న చెప్పిన పని వెంటనే జరిగిపోయేది.. ఇప్పుడు తన ఛాంబర్ వైపు మల్లన్నను రానీయవద్దని ఆ మంత్రి ఆదేశించారట.. అదీ సంగతి.

Popular Articles