ఎమ్మెల్సీ శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆఫీసులో కాల్పులకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలను నిశితంగా గమనించారా? ‘కాల్చెయ్..కాల్చెయ్’ అంటూ ఓ వ్యక్తి గన్ మెన్ ను ఆదేశిస్తున్నాడు. టీ షర్ట్ ధరించి గన్ మెన్లకు ఫైరింగ్ ఆర్డర్ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఇదీ ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే రేకెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే గన్ మెన్లు కాల్పులు జరపాల్సిన అనివార్య పరిస్థితులుగాని, పరిణామాలుగాని దాడి సందర్భంగా ఏర్పడ్డాయా? అనే కోణంలో పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం 2+2 గన్ మెన్లతో భద్రతను కల్పించింది, ఇందులో ఓ గన్ మెన్ 9MM పిస్టల్ ను, మరో గన్ మెన్ 9MM కార్బైన్ గన్ ను ధరించి ఉన్నారు. ఇందులో ఒకటి షార్ట్ వెపన్ కాగా, మరొకటి భారీ ఆయుధం. కాకపోతే ఈ రెండింట్లోనూ వినియోగించే తూటాలు మాత్రం ఒకే సైజులో ఉంటాయి. ఇటువంటి ఆయుధాలను ధరించి వీఐపీలకు రక్షణగా ఉండే గన్ మెన్లు చాలా అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. తాము రక్షణగా ఉన్నటువంటి వీఐపీపై దాడి జరిగినా, అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందని భావిస్తే చాలు గన్ మెన్లు ఫైర్ ఓపెన్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఏ అధికారి అనుమతి కూడా తీసుకోవలసిన అవసరం లేదు. కాకపోతే ఘటనానంతరం కాల్పులకు దారి తీసిన పరిస్థితులను సమర్ధించుకునే కారణాలు సహేతుకంగా విచారణలో వెల్లడి కాకుంటే మాత్రం ఫైరింగ్ చేసిన గన్ మెన్లు శాఖాపరంగా కఠిన చర్యలను చవి చూడాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి సందర్భంగా తుపాకులు తీసి కాల్పులు జరపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా రేకెత్తుతున్నాయి. తనపై దాడి జరిగిందని, గాయం కూడా అయిందని, తన గన్ మెన్ బాలక్రిష్ణ చేతిలో నుంచి తుపాకీ లాక్కుని ఓ వ్యక్తి తనను చంపేందుకు ప్రయత్నించాడని తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఘటనా స్థలంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఇప్పటి వరకు బహిర్గతమైన వీడియోల్లో మాత్రం మల్లన్నపై దాడికి తెగబడిన వ్యక్తి వీడియోలేవీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. దాడి జరిగింది మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసులోనే కాబట్టి, ప్రతి దృశ్యం రికార్డయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడికి తెగబడిన వ్యక్తి గన్ మెన్ తుపాకీ గుంజుకుని హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన వీడియోను తీన్మార్ మల్లన్న బయటపెడితే అతని వాదనకు మరింత బలం చూకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఓ వీడియోలో 9MM కార్బైన్ గన్ ధరించిన గన్ మెన్ తొలుత గాల్లోకి జరిపిన తరహాలో తుపాకీ ఎక్కుపెట్టి ఓ రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత చోటు చేసుకున్న దృశ్యంలో మరో గన్ మెన్ 9MM పిస్టల్ ను బయటకు తీసి కొందరివైపు గురి పెట్టడం క్లియర్ గానే కనిపిస్తోంది. ఇదే సందర్భంగా 9MM కార్బన్ గన్ ధరించిన వ్యక్తి ఓ రౌండ్ ను పైకి కాల్చిన తర్వాత పక్కనే టీ షర్ట్ ధరించిన యువకుడొకరు ‘కాల్చెయ్.. కాల్చెయ్..’ అంటూ ఆదేశిస్తూ ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు కనిపించింది. ఈ వ్యక్తి ఎవరన్నదే ఇప్పుడు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఇదే సీన్ లో దాడికి పాల్పడిన వ్యక్తులను ఉద్ధేశించి బూతు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరో వీడియోలో 9MM కార్బైన్ గన్ ధరించిన గన్ మెన్ డోర్ వ్యూ గ్లాస్ రంధ్రం నుంచి తుపాకీ ఉంచి కాల్పులు జరుపుతున్నట్లు కూడా కనిపిస్తోంది.

అయితే ఈ కాల్పుల పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడానికి వస్తే కాల్పులు జరుపుతారా? అని ఆమె నిలదీస్తున్నారు. తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని తన విచక్షణాధికారంతో రద్దు చేయాలని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫిర్యాదు చేశారు. స్థిమితం లేని తీన్మార్ మల్లన్నకు గన్ మెన్లు అవసరమా? అని ప్రశ్నించారు. అసలు ఎవరు కాల్పులు జరిపమన్నారు? గన్ మెన్లు ఎందుకు కాల్పులు జరిపారు? అనే అంశాలపై విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి చేసిన ఫిర్యాదు పత్రాన్ని లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ కు కవిత అందజేశారు. కాగా తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్ మెన్లు కాల్పులు జరపకుండా ఉంటే అసలు ఈ దాడి ఘటనకు ఇంతలా ప్రాచుర్యమే వచ్చి ఉండేది కాదని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించడం అసలు కొసమెరుపు.