(సమీక్ష ప్రత్యేకం)
హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా? లేదంటే హెడ్డింగే తప్పనుకుంటున్నారా? మీరు చదవబోయే ఆసక్తికర కథనానికి ఈ శీర్షిక కరెక్టే. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. టీడీపీ అభ్యర్థులకు కంకి కొడవలి, కారు గుర్తులపై ఓటు వేయడమేంటనే ప్రశ్న తడుతోందా? అదే అసలు విశేషం మరి. మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర, విచిత్ర పొత్తుల పరిణామం అన్నమాట. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నగర పాలక సంస్థ ఓటర్లు, అశ్వారావుపేట మున్సిపల్ ఓటర్లు ఇదే తరహా ఎన్నికల ప్రచారాన్ని చూడబోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..?
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య పొత్తుల పోటీ చిత్ర విచిత్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పొత్తులు మరీ ఆసక్తికరమనే చెప్పాలి. మధిరలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో సీపీఎం-బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ-టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. ఇల్లెందులో సీపీఐ, సీపీఎం, మాస్ లైన్, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక అశ్వారావుపేటలో బీఆర్ఎస్-టీడీపీ, సీపీఎం-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇలా భిన్న కలయికలతో కలిసి పోటీచేస్తున్న రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థుల ఎన్నికల గుర్తు మారిపోవడమే అసలు విశేషం. కొత్తగూడెం నగరపాలక సంస్థలోని 5, 37, 42 నెంబర్ల డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సీపీఐకి చెందిన ‘కంకి కొడవలి’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించాల్సి వస్తోంది. ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు సీపీఐ పార్టీ బీ ఫారాన్ని ఇవ్వడమే అందుకు కారణం. అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ‘కారు’ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ బీ ఫారాన్ని ఇవ్వడం గమనార్హం.

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ బీ ఫారాలు ఇవ్వలేదు. స్థానికంగా కుదుర్చుకున్న పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన తమ పార్టీ నాయకులకు బీ ఫారాలను పార్టీ అధిష్టానం కేటాయించలేదని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి వాసిరెడ్డి రామనాథం ‘సమీక్ష’ న్యూస్ తో చెప్పారు. ఇతర పార్టీల గుర్తులతో తమ పార్టీవారు పోటీలో ఉన్నట్లు తనకూ సమాచారం ఉందని, వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్న తమ పార్టీకి చెందినవారు మాత్రం ‘స్వతంత్ర’ అభ్యర్థుల గుర్తులతో పోటీ చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా కొత్తగూడెం కార్పొరేషన్ లో తమ పార్టీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు తామే బీ ఫారాలు ఇచ్చినట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ‘సమీక్ష’తో ధ్రువీకరించారు. మూడు డివిజన్లను టీడీపీకి కేటాయించామని, చాలా ఏళ్లుగా వాళ్లు మాతోనే కలిసి ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యంగా తమ పార్టీ తరపున ఆ ముగ్గురు అభ్యర్థులకు తామే బీ ఫారాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో కూటమిగా ఉన్నటువంటి పార్టీల్లో బీజేపీ, జనసేన పార్టీలు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కానీ వారి వారి పార్టీల గుర్తులతోనే అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, జనసేన తమ అభ్యర్థులకు బీ ఫారాలు కేటాయించగా, టీడీపీ మాత్రం బీ ఫారాలు ఇవ్వలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు కంకి-కొడవలి, కారు గుర్తులను చూపి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాల్సిన ‘విచిత్ర’ స్థితి నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పొలిటికల్ పార్టీల పొత్తుల్లో కంకి-కొడవలి, కారు గుర్తులపై పోటీ చేస్తున్న వ్యక్తులు పార్టీపరంగా టీడీపీకి చెందినవారే.. కానీ గెలిచాక మాత్రం సాంకేతికంగా సీపీఐ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవుతారనేది అసలు కొసమెరుపు.

