‘’ప్రజలకు దూరంగా, ప్రజలను విస్మరించి, ప్రజలతో సంబంధం లేకుండా చేసే ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదు, మరే పోరాటం కూడా విప్లవాన్ని సాధించలేదు’’
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి చెప్పిన హితవు వాక్యాలివి. విప్లవోద్యమాలపై తరిమెల నాగిరెడ్డి చేసిన నిర్వచనంలోని స్థూల సారాంశం ఇదే. రష్యన్ విప్లవం గురించి, స్టాలిన్ లీడర్ షిప్ గురించి విస్తృతంగా చదివిన తరిమెల నాగిరెడ్డి ప్రస్థానం గురించి కమ్యూనిస్టులకే కాదు, విప్లవోద్యమాభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిందేమీ లేదు. తరిమెల నాగిరెడ్డి హితవాక్యాల ప్రస్థావన ప్రస్తుతం దేనికంటే..
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను పేరుతో వెలుగులోకి వస్తున్న పలు లేఖల్లోని అనేక అంశాలు తరిమెల నాగిరెడ్డి సూత్రీకరించిన హితోక్తులను గుర్తు చేస్తున్నాయని చెప్పక తప్పదు. అభయ్ ఇప్పటికే ఏమన్నారు? ‘‘విప్లవోద్యమంలో మీకు కలిగిన నష్టాలకు, మీరు భరించిన కష్టాలకు, మీరు చేసిన అసమాన, అనుపమాన త్యాగాలకు మేమే బాధ్యత పడుతున్నాం. మా మిడిమిడి జ్ఞానంతో, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, మా ఆచరణలో అవలంభించిన అతివాద, ఒంటెత్తువాద తప్పులకు మమ్మల్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుదీర్ఘ కాలంలో జరిగిన తప్పులకు బాధ్యత పడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని అర్థం చేసుకోగలరు. ఈ నిర్ణయం తీసుకోకుండా మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. మీ త్యాగాలకు, అమరుల బలిదానాలకు న్యాయాన్ని చేకూర్చలేం. ఈ ‘ఓటమి’ బాధాకరమైనదే..’’ కొద్దిరోజుల క్రితం అభయ్ పేరుతో వెలువడిన ప్రకటనలోని ముఖ్య సారాంశమిది.

తాజాగా వెలుగులోకి వచ్చిన 22 పేజీల లేఖలోనూ అభయ్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మాడ్ ప్రాంతంలో అటవీ హక్కుల యాజమాన్యం చట్టం కింద ప్రభుత్వం ఇచ్చే భూ పట్టాలు ఆదివాసీలకు అవసరం లేదన్నామని అభయ్ పేర్కొన్నారు. దండకారణ్యంలోని రైతులకు జనతన సర్కార్లే పట్టాలిస్తాయని చెప్పామని, ఆదివాసీ రైతులకు సామూహిక పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. కానీ పొసగని డిమాండ్లు ముందుకు తెచ్చి ప్రభుత్వ విధానాన్ని పార్టీ వ్యతిరేకించిందని, ఇటువంటి అనేక అంశాలను వినియోగించుకుని ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కమిటీ సీరియస్ గా తీసుకోలేదని అభయ్ ప్రస్తావించారు. మన జనతన సర్కార్లు ఇచ్చే పట్టాలకు ఈ వ్యవస్థలో గుర్తింపు లేదనీ, ఆదివాసీ రైతుల అనేక అవసరాలను అవి తీర్చలేవనే ప్రాక్టికల్ నాలెడ్జిని సీసీ ప్రదర్శించలేకపోయిందన్నారు. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజా పునాదిని పెంచుకునే దిశలో పార్టీ ఆలోచించలేదన్నారు.

అదేవిధంగా జనతన సర్కార్ నిర్వహించిన స్కూళ్లలో విద్యార్థులకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ అనుసరించిన పద్ధతినీ అభయ్ ఆక్షేపించారు. ఇటువంటి అనేక అంశాల్లోని పార్టీ అనుసరించిన విధానాలను అభయ్ తన 22 పేజీల లేఖలో ఉటంకించిడం గమనార్హం. ఇటువంటి నాయకత్వ వైఖరి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, ఇంకా ఇలాంటివి బోలెడు తప్పులు చేశామని, ప్రజలు ఆధార్ కార్డులు తెచ్చుకోవడాన్ని కూడా పార్టీ వ్యతిరేకిస్తే తెలివైన జనాలు తమ జీవిత అవసరాలకోసం అనివార్యమైన ఆధార్ కార్డులను పార్టీకి తెలియకుండా దొంగచాటుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి తెచ్చుకున్నారని అన్నారు. ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకోవలసినవాటిన దొడ్డిదారిన సాధించుకునే మార్గాలను మనమే చూపామని అభయ్ తన లేఖలో పేర్కొన్నారు.

మొత్తంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ పేరుతో వెలువడుతున్న ఇటువంటి అనేక లేఖలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజావసరాలను గుర్తించకుండా, ప్రజాభీష్టాన్ని గమనంలోకి తీసుకోకుండా, ప్రజలను విడనాడి చేసే ఉద్యమాలు విజయం సాధించలేవని తరిమెల నాగిరెడ్డి దశాబ్ధాల క్రితం చెప్పిన మాటల సారాంశమే మల్లోజుల లేఖల్లో గోచరిస్తోందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. అయితే అభయ్ తన లేఖల్లో లేవనెత్తిన అంశాల సారాంశాన్ని మావోయిస్ట్ పార్టీ అంగీకరిస్తుందా? ఆత్మ విమర్శ చేసుకుంటుందా? అనేది మాత్రం వేరే అంశం.