హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయారు. వీరిలో పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డిి అలియాస్ గంగన్న ఉన్నారు.

కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (62) జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి. గడచిన 44 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో అజ్ఞాతంగా ఉన్నారు. తిరుపతిపై రూ. 25.00 లక్షల నగదు రివార్డు ఉంది.

అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (76) పెద్దపల్లి జిల్లా శాస్త్రులపల్లెకు చెందిన వ్యక్తి. గడచిన 46 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇతనిపై రూ. 25.00 లక్షల నగదు రివార్డు ఉంది.

తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (47) ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన వ్యక్తి. గడచిన 28 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమ జీవితాన్ని గడిపారు. దామోదర్ పై రూ. 20.00 లక్షల నగదు రివార్డు ఉంది.

లొంగిపోయిన మరో అగ్రనేత నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న (62) ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి. గడచిన 36 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. నరసింహారెడ్డిపై కూడా రూ. 20.00 లక్షల నగదు రివార్డు ఉంది.

ప్రభుత్వానికి లొంగిపోయిన ఆయా నక్సల్ నేతలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం రూ. 90.00 లక్షల చొప్పున తక్షణమే చెల్లిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్ కు పునరావాసం కింద లభించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించేందుకు తెలంగాణా ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు.

గణపతి అడవుల్లో లేడు: డీజీపీ
కాగా మావోయిస్ట్ అగ్ర నేత ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అడవుల్లో లేడని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం గణపతి బయట ఎక్కడో షెల్టర్ లో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం తమకు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నిక కాలేదని కూడా డీజీపీ చెప్పారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరగలేదని, జరిగితే తిరుపతి కార్యదర్శి అయ్యేవారని చెప్పారు.

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణాకు చెందినవారు ఇంకా 11 మంది ఉన్నారని, అందులో గణపతి కూడా ఉన్నారని చెప్పారు. ఆయా నక్సల్స్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. మావోయిస్ట్ పార్టీలో రాష్ట్రం నుంచి 2019లో చివరి రిక్రూట్ మెంట్ జరిగిందని, ఈసారి చెట్టు వాడిపోయినట్లేనని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. కాగా ఆయా నక్సల్ నేతల లొంగుబాటులో కీలకంగా విధులు నిర్వహించిన ఎస్ఐబీ ఐజీ సుమతిని, ఇంటెలిజెనస్ డీజీ విజయ్ కుమార్ ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

అనారోగ్యం వల్లే లొంగుబాటు: దేవ్ జీ
అనారోగ్యం వల్లే తాను లొంగిపోయానని, వ్యక్తిగత జీవితం కోసం కాదని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని, ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. ‘ఆశపడి అడగడం మీ డ్యూటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమగ్రంగా చెప్పలేను.అసమగ్రంగా చెబితే అది వక్రీకరణకు, అపార్ధాలకు, చర్చలకు దారి తీస్తుంది. ఈ స్థితిని అర్థం చేసుకోండి’ అని మీడియాకు దేవ్ జీ విజ్ఞప్తి చేశారు. తర్వాత సమయం ఇచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై పని చేస్తాం: మల్లా రాజిరెడ్డి
ప్రజా సమస్యలపై ప్రజల తరపున తాము పనిచేస్తామని ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ సిద్ధాంతంలోకి వెళ్లాలనేది తమ ఉద్ధేశం కాదన్నారు. ప్రజాస్వామ్య పోరాటాలను సంఘటితం చేయాలన్నారు. మావోయిజం ఎప్పుడూ ముగిసిసోదని, ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. తాము నలుగురం అనుకుని లొంగిపోవడానికి రాలేదని, ప్రభుత్వంతో చర్చించి అడవుల్లో గల మిగతావారికి సందేశం ఇస్తామని రాజిరెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

