Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఇంతకీ ‘సల్వాజుడుం’పై అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పిందేమిటి!?

‘సల్వాజుడుం’ దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతున్న పేరు. సల్వాజుడుం అంటే ఛత్తీస్ గఢ్ లోని ‘గోండి’ భాషలో ‘శాంతి యాత్ర’ అని అర్థం. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా, ‘ఇండియా’ కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దేశంలో నక్సలిజం మరో 20 ఏళ్లు కొనసాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం సంస్థపై ఇచ్చిన తీర్పే కారణమని అమిత్ షా మరోసారి ఆరోపించారు. సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై దేశంలోని 18 మంది రిటైర్డ్ జడ్జిలు ఆక్షేపణ తెలిపారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘సల్వాజుడుం’ సంస్థపై అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటనేది సహజంగానే ఆసక్తికర అంశంగా మారింది.

బీజేపీ ప్రభుత్వం హయాంలో.. ఛత్తీస్ గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ఉన్న కాలంలో కాంగ్రెస్ నేత, దంతెవాడ ఎమ్మెల్యే, ఛత్తీస్ గఢ్ సీఎల్పీ లీడర్ మహేంద్ర కర్మ నాయకత్వంలో సల్వాజుడుం సంస్థ ఏర్పడడం గమనార్హం. నక్సల్స్ కు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ 1991లో జన్ జాగరణ్ అభియాన్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. తొలుత ఈ ఉద్యమానికి స్థానిక వ్యాపారులు, వ్యాపారవేత్తలు నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణామాల్లో 2005నాటికి మహేంద్రకర్మ నాయకత్వంలోని ఈ సంస్థ ‘సల్వాజుడుం’గా మారింది. వాస్తవానికి సల్వాజుడుం సంస్థ కార్యకలాపాల చరిత్ర చాలా పెద్దది. ఇది ఓ ప్రయివేట్ సైన్యంగా ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వమే ఈ ప్రైవేట్ సైన్యానికి ఆయుధాలిచ్చిందనే ఆరోపణలు వచ్చాయి.

సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ (ఫైల్ ఫొటో)

ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఛత్తీస్ గఢ్ లోని అనేక ఆదివాసీ గిరిజన తెగల్లో గొత్తికోయ, మరియా జాతులు ప్రధానమైనవి. నక్సల్స్ మద్థతుదారులుగా గొత్తికోయలు, సల్వాజుడుం సైన్యంగా మరియా తెగ వేరుపడినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. సూటిగా చెప్పాలంటే సల్వాజుడుంలో చేరని వారంతా నక్సలైట్లుగా, నక్సల్స్ కు మద్ధతు ప్రకటించనివారంతా సల్వాజుడం కార్యకర్తలుగా ‘ముద్ర’ పడిన చరిత్ర అది. తుపాకులు చేబూనిన సల్వాజుడుం సంస్థ సభ్యుల కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణలు, విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈ సంస్థను ఏర్పాటు చేసిన మహేంద్ర కర్మను 2013 మే 25న మావోయిస్టులు మెరుపుదాడి చేసి చంపారు. సల్వాజుడుం సంస్థపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందులో పనిచేసినవారందరూ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లోని వివిధ పోలీసు విభాగాల్లో చట్టబద్ధంగానే విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.

సల్వాజుడుం సంస్థ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు గురించి ప్రముఖ న్యాయకోవిదుడు, కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ గా పనిచేసిన మాడభూషి శ్రీధర్ ఇటీవల ఓ ఆసక్తికర వ్యాసాన్ని రాశారు. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత శ్రీధర్ తన వ్యాసంలో ‘సల్వాజుడుం’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన అనేక తీర్పులను గుర్తు చేస్తూ న్యాయంలో మానవతా విలువల ప్రతిబింబంగా ఆయనను మాడభూషి శ్రీధర్ తన వ్యాసంలో అభివర్ణించారు. సల్వాజుడుం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాడభూషి శ్రీధర్ తన వ్యాసంలో ఉటంకించిన అంశాలు యధాతథంగా..

తుపాకులతో ‘సల్వాజుడుం’ కార్యకర్తలు (ఫైల్ ఫొటో)

సల్వా జుడుం కేసు:
Nandini Sundar & Others vs State of Chhattisgarh పేరుతో 2011 జులై 5 న చరిత్రాత్మకమైన ఎంతో గణనీయమైన తీర్పునిచ్చారు. అదొకటే ఒక పుస్తకంగా రావలసిన తీర్పు. (ఈ ఇంగ్లీషుతీర్పుపై అనువదించే అవకాశం ఈ రచయితకు లభించింది. మలుపు పబ్లికేషన్స్ ప్రచురించింది) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి జస్టిస్ ఎస్.ఎస్. నాజీర్ ధర్మాసనం ద్వారా సుదర్శన్ రెడ్డి రచించిన ఈ తీర్పులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం “సల్వా జుడుం” అనే పేరుతో గిరిజనులను ఆయుధదారులుగా నియమించి మావోయిస్టుల పై పోరాటానికి ఉపయోగించడం గురించి ఘాటైన తీర్పుప్రకటించారు. తప్పకుండా చర్చించవలసిన ప్రధానమైన అంశాలు ఇవి:

  1. సల్వా జుడుం అక్రమమని నిర్ణయం:

ప్రభుత్వమంతట కూడా తన పౌరులైన గిరిజనులను ఆయుధదారులుగా మావోయిస్టులపై పోరాటానికి నియమించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చింది.

  1. దారుణమైన అస్త్రాలతో పౌరుల నియామకం అనైతికం:

SPOs (Special Police Officers) గా గ్రామస్థులను నియమించడం అనైతికమనీ, వారికి తగిన శిక్షణ లేకుండా ఆయుధాలు ఇచ్చి పోరాటానికి పంపడం చాలా ప్రమాదకరమనీ అని కూడా ఈ ధర్మాసనం వివరించింది.

  1. మౌలిక హక్కుల ఉల్లంఘన చెల్లదు:

ఈ విధానం ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ఆర్టికల్ 21 (జీవిత హక్కు)కు విరుద్ధమని తీర్పు చెప్పింది.

  1. సల్వా జుడుం రద్దు చేయాల్సిందే:

సల్వా జుడుం చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఆయుధాలు ఇచ్చిన గ్రామస్తుల్ని ఉపసంహరించుకోవాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

  1. పౌరుల భద్రత ప్రభుత్వ బాధ్యత:

ప్రభుత్వం సురక్షిత, న్యాయపరమైన మార్గాల్లో మావోయిస్టు సమస్యను పరిష్కరించాలి కానీ పౌరులను ఆయుధంగా మార్చకూడదని కోర్టు గట్టిగా హెచ్చరించింది.

ఈ తీర్పు ద్వారా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజల హక్కుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. న్యాయం, మానవహక్కులు మరియు రాజ్యాంగ ప్రమాణాలను కాపాడటంలో ఇది గొప్ప ముందడుగు. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థలో “జ్యుడిషియల్ హ్యూమానిజం” (న్యాయంలో మానవతా విలువల ప్రతిబింబం) కి గొప్ప ఉదాహరణగా నిలిచింది.

Popular Articles