(సమీక్ష ప్రత్యేక కథనం)
మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం.. పొలిటికల్ పవర్ ముందు పోలీస్ పవర్ నిస్సహాయంగా మిగిలిపోతుంది. చేష్టలుడిగి చూస్తుంటుంది. మరికొన్ని సినిమాల్లో పోలీస్ పవర్ ముందు పొలిటికల్ పవర్ సాగిలపడుతుంది. ‘అంకుశం’ మూవీలో చార్మినార్ ముందు నడిబజారులో రామిరెడ్డి పాత్రను రాజశేఖర్ పోలీస్ పాత్ర హీరోయిజంతో గుడ్డలూడదీసి కొడుతుంది. అది సినిమా.. సీన్ ఎలా అంటే అలా రాసుకుని, చిత్రీకరించిన దృశ్యపు వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
కానీ వర్తమానంలో మన కళ్లముందే పొలిటికల్ పవర్ కు పోలీస్ పవర్ చెక్ పెట్టగలదంటే నమ్మశక్యమేనా..? ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శైలిని లోతుగా పరిశీలిస్తే సినిమా సీన్ వేరు, కళ్ల ముందు కనిపించే వాస్తవం వేరని అంగీకరించక తప్పదు. రాష్ట్రంలో అత్యున్నత పొలిటికల్ పవర్ సెంటర్ నుంచి ఒత్తిడి ఎదురైనా సరే కీలక కేసుల్లో నిందితులైన వ్యక్తులు పోలీస్ పవర్ ముందు సరెండర్ కావడమో, అరెస్ట్ కావడమో అనివార్యంగా జరగాల్సిందే.. అని నిరూపించిన సునీల్ దత్ విధినిర్వహణ తీరు గురించి తెలుసుకునే ముందు ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెడదాం..

వనమా రాఘవ అనే వ్యక్తి గుర్తున్నాడు కదా? మాజీ మంత్రి, కొత్తగూడెం రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వనమా వెంకటేశ్వర్ రావు సుపుత్రుడు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2022లో పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యోదంతంలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన కుటుంబం ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన లేఖ, విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో రాఘవపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వనమా రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు నమోదు అనంతరం అత్యంత రాజకీయ పలుకుబడి గల వనమా రాఘవ పాల్వంచలోని తన నివాసం నుంచి పారిపోవలసి వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో దాదాపు నెలరోజులపాటు వనమా రాఘవ అడ్రస్ లేకుండా ఎక్కడో దాక్కోవలసి వచ్చింది. కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా వనమా వెంకటేశ్వర్ రావు సైతం తన కుమారుడు ఈ కేసు ఫలితంగా పారిపోయి దాక్కోవలసిన పరిస్థితుల నుంచి గట్టెక్కించలేకపోయారు. అప్పట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా ఉన్న ప్రస్తుత ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉన్నారు. వనమా రాఘవను అరెస్ట్ చేయకుండా పొలిటికల్ పవర్ ఆయనను నిలువరించేందుకు విఫలయత్నం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇందులో భాగంగానే అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు అనేక మంది సునీల్ దత్ పై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి సీఎం హోదాలో కేసీఆర్ సైతం సునీల్ దత్ కు ఫోన్ చేసినట్లు కూడా వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. దీంతో ‘రాఘవను అరెస్ట్ చేయకుంటే రాజకీయంగా మీకే నష్టం జరుగుతుంది సర్’ అని అప్పటి ఎస్పీ సునీల్ దత్ అత్యంత లౌక్యంగా కేసీఆర్ కు నచ్చజెప్పినట్లు కూడా ప్రచారం జరిగింది. మొత్తంగా ఎన్నివైపుల నుంచి రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, రాఘవ పోలీసు పవర్ ‘దారి’లోకి రాకతప్పని అనివార్యతను సునీల్ దత్ తనదైన శైలిలో కల్పించారనేది మొత్తం ఎపిసోడ్ లోని అసలు సారాంశం.
దీంతో ఎట్టకేలకు వనమా రాఘవ తన అజ్ఞాతం వీడి పోలీసులు అరెస్ట్ చేసే విధంగా ‘దారి’లోకి రాకతప్పలేదు. ఆ తర్వాత లభించిన బెయిల్ షరతుల ప్రకారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేసే పరిస్థితి వనమా రాఘవకు ఏర్పడింది. ఆయా పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ వనమా రాఘవను సస్పెండ్ చేసింది. ఇప్పటికీ మళ్లీ రాఘవపై సస్పెన్షన్ ఎత్తివేసిన దాఖలాలు లేవు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఘటన, కేసు ఫలితంగా రాఘవ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదీ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పొలిటికల్ గా సూపర్ పవర్ ను కలిగి ఉన్నట్లు ప్రాచుర్యంగల వనమా రాఘవ విషయంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశం. ఇప్పుడు తాజాగా జరిగిన మరో ఘటనకు సంబంధించిన విషయంలోకి వెడితే..

సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా వందలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కేసుల్లో కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి అరెస్ట్ పర్వంలోనూ ప్రస్తుత ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖాకీ చొక్కా పవర్ ను ప్రదర్శించడం విశేషంగానే చెప్పుకోవాలి. పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన సైబర్ దోపిడీ కేసులో ఇప్పటికే దాదాపు 20 మందికిపైగా అరెస్టయినప్పటికీ, కీలక నిందితుడైన వికాస్ చౌదరి మాత్రం పోలీసులకు చిక్కలేదు. గడచిన రెండు నెలలుగా వికాస్ చౌదరిని అరెస్ట్ చేయంలో పోలీసులు సఫలం కాలేకపోయారు. జనం సొమ్మును కొల్లగొట్టడం ద్వారా చార్టెడ్ ఫ్లయిట్లలో విహరించే స్థాయికి ఆర్థికంగా ఎదిగినట్లు ప్రాచుర్యంలో గల వికాస్ చౌదరికి గల పొలిటికల్ పవర్ కూడా సామాన్యమైనదేమీ కాదనే చెప్పాలి.
వ్యాప్తిలో గల వార్తల ప్రకారం… ఉడతనేని వికాస్ చౌదరిని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర అత్యున్నత స్థాయి పొలిటికల్ పవర్ సెంటర్ నుంచి పోలీసులకు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. ఎందుకంటే వికాస్ చౌదరి బంధువు ఒకాయనకు ఆ పవర్ సెంటర్ లోని మరో కీలక నాయకుడి వద్ద అత్యంత పరపతి గల సత్తుపల్లి ప్రాంత ద్వితీయ శ్రేణి పొలిటికల్ లీడర్ గా పేరుంది. దీంతో ఓసారి అదుపులోకి తీసుకున్న వికాస్ చౌదరిని నానక్ రాం గూడ ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్దే వదిలేయాల్సిన అనివార్య స్థితి కూడా పోలీసులకు ఏర్పడినట్లు కూడా వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వికాస్ చౌదరి అరెస్ట్ అంశంలో ప్రజల్లో సహజమైన అభిప్రాయాలే ఏర్పడ్డాయి.

అయితే అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఏర్పరచుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు నమోదైన కేసుల్లో కీలక నిందితుడైన వికాస్ చౌదరి అరెస్ట్ అంశంలో సీపీ సునీల్ దత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడమే ఇక్కడ అసలు విశేషం. అతని అరెస్టుకు అడ్డుపడుతున్నట్లు జనంలో ప్రచారం జరిగిన పొలిటికల్ పవర్ కు సునీల్ దత్ విధి నిర్వహణపరంగానే తనదైన ప్రతిభను ప్రదర్శించడం గమనార్హం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులు తనను టచ్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వికాస్ చౌదరి ప్రయత్నించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్ అనే పదమే తన చెవిన పడకుండా ఉండేందుకు గడచిన రెండు నెలలుగా వికాస్ చౌదరి అరెస్ట్ అనే సీన్ నుంచి బయటపడేందుకు విఫలయత్నం చేశాడు. అయితే వికాస్ చౌదరి ప్రయత్నాలకు సీపీ సునీల్ దత్ పర్యవేక్షణలో సంబంధిత స్టేషన్ పోలీసులు ఎప్పటికప్పుడు కోర్టులో ‘కౌంటర్’ దాఖలు చేయడం ఆసక్తికరం. ఫలితంగా అరవై రోజులపాటు తప్పించుకుని తిరిగిన వికాస్ చౌదరి అనివార్యంగా అరెస్ట్ అయ్యేందుకు పోలీసులు క్రియేట్ చేసిన ‘దారి’లోకే రావడం అసలు విశేషం. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు వికాస్ చౌదరిని మొన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ రెండు ఘటనలను పరిశీలించినపుడు పోలీసులు తలచుకుంటే నేర ఘటనల్లో నిందితులుగా మారిన వ్యక్తుల పొలిటికల్ పవర్ కు అడ్డుకట్ట వేయగలరనే విషయం సుస్పస్టమైంది. ప్రజాప్రయోజన అంశాలకు సంబంధించిన నేర ఘటనల కేసుల్లో సమర్థవంతమైన అధికారులు సరైన దిశగా వ్యవహరిస్తే పోలీస్ శాఖపై ప్రజల్లో గల దురభిప్రాయానికి ఇటువంటి ఘటనలు సదభిప్రాయానికి కూడా ఆస్కారం కలిగిస్తాయని చెప్పే లక్ష్యపు వార్తా కథనమిది.

