ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. దరిమిలా 20 మంది వరకు మృతి చెందినట్లు, వందలాది మంది గాయపడినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఒక్కరోజే హాజరైనట్లు భావిస్తున్న సుమారు 10 కోట్ల మంది భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది.
భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సెక్టార్ -2 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే దశలో ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.
ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి భక్తులకు కీలక వినతి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా, సమీప ఘాట్ల వద్దే పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు.