Top 5 This Week

Related Posts

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యారు. అంగరంగ వైభవంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిధిలా ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకం వేడుక భక్తులను అలరించింది. తొలుత రామాలయం భద్రుని మండపంలో అర్చక స్వాములు స్వామివారి పాదుకలకు అభిషేకం జరిపారు. రాజ లాంఛనాలతో పవిత్ర పావన గౌతమీ నదీ తీరం నుంచి తీర్థములు తీసుకొచ్చారు. భాజా భజంత్రీల సందడి, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటంతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. శిల్పకళా శోభిత కళ్యాణ మండపంపై స్వామివారు ఆశీనులయ్యారు. అర్చక స్వాములు తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారికి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణం ధరింప చేశారు. శ్రీరామ పట్టాభిషేక పారాయణం గావించారు.

ఈ సందర్భంగా ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఆదరణ వేదం, విష్ణు పురాణం, భగవత్ శాస్త్రం తదితర పారాయణములు గావించారు. పుష్కర నదీ జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ చేశారు. పుష్కర నది జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ గావించారు. మొత్తం 11 శ్లోకాలను పట్టించి స్వామివారికి హారతి ఇచ్చారు. అర్చక స్వాములు భక్తులచే పలు స్తోత్రాలను పఠింపజేశారు. శ్రీరామ నామ స్మరణలతో మిధిలా ప్రాంగణం ప్రతిధ్వనించింది. పట్టాభిషేకం అనంతరం భక్తులపై అర్చక స్వాములు పుణ్య నదీ జలాలను చల్లారు.

రాములోరికి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రీరామ పట్టాభిషేకం వేడుకకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మహోత్సవాన్ని ఆద్యంతం తిలకించారు. తొలుత రామాలయంలో గవర్నర్ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్, రామాలయం ఈవో రమాదేవి తదితరులు పట్టాభిషేకం వేడుకలో పాల్గొన్నారు. కాగా గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య వేడుకలైన శ్రీ సీతారాముల వారి కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకానికి దేశ నలుమూలల నుంచి హాజరైన భక్తజనం తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగారు.

Popular Articles