ఒక్కో ఎన్నికను నిశితంగా పరిశీలించినపుడు ఇంకో ఎన్నికలో ప్రధాన పార్టీల వ్యవహార శైలి గుర్తుకొస్తుంది. అది ఉప ఎన్నిక కావచ్చు., సాధారణ ఎన్నికైనా కావచ్చు. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పడే పాట్లు, చేసే ఖర్చు, ఓటర్లకు పంచిపెట్టే కరెన్సీ నోట్ల వంటి అంశాలు చర్చగా మారుతాయి. రేపు పోలింగ్ జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చుపై భిన్న వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తా కథనాల్లోని సారాంశాన్ని లోతుగా పరిశీలించినపుడు సంపన్న ఏరియాగా ప్రాచుర్యం పొందిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా స్లమ్ ఏరియాలే ఉన్నాయనే వాదన కూడా ఉంది. అయినప్పటికీ వాళ్లంతా హైదరాబాద్ మహానగర ఓటర్లే. అంతటి మహానగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఓటర్లను రాజకీయ పార్టీలు చిన్న చూపు చూశాయనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణా మాండలికంలో చెప్పాలంటే ‘అగ్గువ’కే ఓట్లను కొనుగోలు చేస్తున్నాయి.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు కేవలం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయట. ప్రాంతాల వారీగా, మన, పర తేడాను నిర్ణయించి మరీ కనిష్టంగా రూ. 1,500, మధ్యస్థంగా రూ. 2,500, గరిష్టంగా రూ. 5,000 చొప్పున ఓటర్లకు పంచుతున్నాయట. తాము బలంగా ఉన్నట్లు భ్రమిస్తున్నచోట., లేదా భావిస్తున్నచోట కేవలం రూ. 1,000 మాత్రమే ఇస్తున్నారట. బలహీనంగా ఉన్నచోట మాత్రం రూ. 5,000 చొప్పున ఇస్తున్నారట. నియోజకవర్గంలోని మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లలో కనీసం 2 లక్షల మంది ఓటర్లు టార్గెట్ గా ఓటుకు నోటు పంపిణీ కార్యక్రమం జరుగుతోందట. గత ఎన్నికల పోలింగ్ శాతం చరిత్రను, ఓటు హక్కును వినియోగించుకునేవారి సంఖ్యను బేరీజు వేసుకుని గెలుపు ప్రాతిపదికగా నోట్ల పంపిణీలో పార్టీలు నిమగ్నమయ్యాయట.

మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఖర్చు కొత్త రికార్డులు సృష్టిస్తోందట. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ మహానగరంలో ఓ ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న మొత్తం కేవలం రూ. 100 కోట్లు..ట! వాస్తవానికి రూ. 100 కోట్ల పంపిణీ అసలు రికార్డే కాదు. నిజం చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో గెలుపుకోసం తపిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు భారీ మొత్తం కానే కాదు. నిష్కర్షగా చెప్పాలంటే ఈ ఉప ఎన్నికల్లో అమ్ముడుపోయే జూబ్లీ హిల్స్ లోని ఓటర్ల విలువను ప్రధాన పొలిటికల్ పార్టీలు ‘చీప్’గా పరిగణించాయనే చెప్పాలి. హైదరాబాద్ కు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో గల ఖమ్మం నియోజకవర్గంలోని ఓ ఏరియాలో ఓటు విలువను రూ. 10,000గా నిర్ణయించి పంపిణీ చేసిన మొన్న మొన్నటి చరిత్రకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్ ఓటు విలువను తగ్గించడం మరీ అన్యాయమనే వెటకారపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో, సరిగ్గా రెండేళ్ల క్రితం ఖమ్మం నియోజకవర్గంలో అమ్ముడు పోయిన ఓటరుకు కట్టిన విలువ గరిష్టంగా ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 10 వేలు. కనిష్టంగా పంపిణీ చేసిన ఓటు విలువ రూ. 2 వేలు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహుషా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొనుగోలు చేసిన ఓటు విలువ తిరుగులేని ‘రికార్డు’ను సొంతం చేసుకుందనే చెప్పాలి. దాదాపు 3.00 లక్షల మంది ఓటర్లు గల ఖమ్మం నియోజకవర్గంలో 2.00 లక్షల ఓట్లు కొనుగోలు లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కరెన్సీ కట్టల గుట్టలను గత ఎన్నికల్లో బయటకు తీశారు.

ఖమ్మం నగర ఓటర్లకు రూ. 2 వేలు చొప్పున పంపిణీ చేశారు. కానీ నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెం మండలంలోని ఓటర్లకు మాత్రం రూ. 5,000 చొప్పున పంపిణీ చేశారు. దాదాపు నలభై వేల మంది ఓటర్లు గల ఈ మండలంలో చివరి నిమిషంలో ‘అనుమానం’ కలిగిన ప్రాంతాల్లో రూ. 10,000 చొప్పున పంపణీ చేసినట్లు ప్రచారం జరిగింది. మొత్తం ఖమ్మం నియోజకవర్గ బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేసిన మొత్తమే 75 నుంచి 80 కోట్ల రూపాయలుగా భిన్న కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రత్యర్థి ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసిన పరిస్థితుల్లో, మనస్కరించకపోయినా అనివార్యంగా మరో పార్టీ అభ్యర్థి కూడా పంపిణీ చేయాల్సి వచ్చిందనే వార్తలూ వెలువడ్డాయి. అయితే రూ. 10 వేల చొప్పున పంపిణీ చేసినట్లు వార్తల్లో నిలిచిన అభ్యర్థి గెలిచారా? లేదా? అనేది ఖమ్మం ఓటర్లకు మాత్రమే తెలిసిన విషయం.
ఈ ప్రాతిపదికన పరిశీలించి, బేరీజు వేసినపుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లకు పంపిణి చేసేందుకు ఖర్చు చేస్తున్నట్లు వార్తల్లోకి వచ్చిన రూ. 100 కోట్లు నగదు భారీ మొత్తం కానేకాదు. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఖర్చే రూ. 100 కోట్లు దాటినట్లు ప్రచారం జరగడం గమనార్హం. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అమ్ముడు పోయిన ఓటరు కన్నా, ఖమ్మం నియోజకవర్గంలో డబ్బు తీసుకున్న ఓటరు విలువే ఎక్కువ. ఇక అసలు కొసమెరుపు ఏమిటంటే..?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమకు డబ్బు అందలేదంటూ కొందరు ఓటర్లు నోట్లు పంపిణీ చేసేవారి నివాసాల వద్ద పడిగాపులు కాస్తున్నారట. పోల్ చిట్టీలు పట్టుకుని మరీ తమ సంగతేమిటని రాజకీయ పార్టీల నేతలను నిలదీస్తున్నారట ఈ అంశంలోనూ జూబ్లీ హిల్స్ ఓటర్లకన్నా ఖమ్మం నియోజకవర్గ ఓటర్లకే చైతన్యం ఎక్కువనే విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ఏరియాలో డబ్బులు ముట్టలేదని ఖమ్మం నియోజకవర్గంలోని కొన్ని ఏరియాల ఓటర్లు ఏకంగా రోడ్డెక్కారు. మహాకూటమి తరపున అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేసిన నామా నాగేశ్వర్ రావు నివాసం ముందు ఆందోళనకు చేపట్టి, ధర్నాకు దిగిన ఖమ్మం నగరంలోని కొందరు ఓటర్ల ధైర్యం, తెగువ, చైతన్యం ముందు జూబ్లీ హిల్స్ ఓటరు దిగదుడుపే కదా..!

