మేడారం: మేడారం మహా జాతర సమీపిస్తోంది. భక్తులు అప్పుడే ముందస్తు దర్శనాలకు పోటెత్తుతున్నారు. వందలాది కోట్ల రూపాయల నిధుల వ్యయంతో ఓ వైపు జాతర ఆధునికీకరణ పనులు జరుగుతున్నప్పటికీ, వనదేవతల దర్శనానికి మహాజాతరకు ముందే భక్తుల తాకిడి ఏరోజుకారోజు పెరుగుతోంది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతర నాటికి భక్తుల సంఖ్యను బేరీజు వేసుకుని, ఆ రద్దీలో దర్శనానికి ఇబ్బంది పడతామని భావిస్తున్నవారందరూ ముందస్తుగానే మేడారం చేరుకుని, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వనదేవతల దర్శనానిక ఏ రోజులు ప్రసిద్ధమనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ప్రస్తుతం నిత్యజాతరగా మారిన మేడారానికి శని, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని వనదేవతల దర్శనం చేసుకుంటున్నారు. సెలవు రోజులు కావడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. కానీ సమ్మక్క-సారక్క దర్శనానికీ కొన్ని ప్రత్యేక వారాలు ఉన్నాయనే విషయం చాల మందికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేయస్వామిని, బుధవారం లక్ష్మీనరసింహస్వామిని, గురువారం సాయిబాబాను, శుక్రవారం అమ్మవార్లను, శనివారం వేంకటేశ్వరస్వామిని, ఆదివారం సూర్యదేవుళ్లను దర్శనం చేసుకునేందుకు భక్తులు ప్రాధాన్యతనిస్తుంటారు. ఇదే తరహాలో మేడారం వనదేవతల దర్శనానికీ ప్రత్యేక రోజులు ఉన్నాయి.

సాధారణంగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు ప్రీతిపాత్రమైన రోజులు బుధ, గురు, శుక్రవారాలు మాత్రమే. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతోపాటు మధ్యలో జరిగే మినీ జాతర తేదీలు కూడా ఆయా వారాల్లోనే వస్తాయనే విషయం గమనార్హం. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లులు జాతర సమయంలో గద్దెలపై ఆసీనులవుతారు. శుక్రవారం భక్తులు మొక్కులను అప్పగిస్తారు. శనివారం వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. తెలుగు నెలల ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి వేళ.. ప్రతి జాతరలో, మినీ జాతరలో ఖరారయ్యే తేదీలు ఖచ్చితంగా ఆయా వారాల్లో మాత్రమే ఉంటాయి.

జాతర సమయాల్లోనే కాదు, సాధారణ రోజుల్లోనూ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి వచ్చి వనదేవతలను దర్శించుకుంటుంటారు. మారిన పరిస్థితుల్లో నిత్య జాతరగా మారిన మేడారానికి ఎక్కువగా ఇవే వారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ, వారాంతపు సెలవుల కారణంతో పిల్లా, పాపలతో కలిసి అనేక కుటుంబాలు ఆదివారం కూడా మేడారానికి పెద్ద సంఖ్యలో రావడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అయితే మంగళవారం, శనివారం మాత్రం అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికీ భక్తులు పెద్దగా సుముఖతను వ్యక్తం చేయరు. మంగళవారాన్ని ప్రత్యేకంగా ఘాతవారంగా భావిస్తారు. వనదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే ఎక్కువగా భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లిస్తారు.

