భోగి పండుగ నాడు నువ్వులతో సద్దరొట్టెలు
ప్రబోధమే పండుగ….
పరమార్థమే పండుగ…
ప్రవచనమే పండుగ…
తెలుగు, తమిళ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను మూడు రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగ వచ్చిందంటే సాంప్రదాయ పిండివంటలు కూడా ఈ విశిష్టతలో భాగస్వామ్యం అవుతాయి.

సకినాలు, జంతికలు, సున్ని ఉండలు,
నువ్వుల ఉండలు ప్రాంతాలను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం కచ్చితంగా ఆచరింపబడుతుంది. అట్లా దక్షిణ తెలంగాణ ప్రాంతం వనపర్తి, గద్వాల, పాలమూరు, నారాయణపేట ప్రాంతాల్లో.. రాయలసీమ కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో… ప్రత్యేకించి భోగి పండుగ నాడు సద్దరొట్టెల ప్రాధాన్యత కొనసాగుతుంది.
సద్ద లేదా సజ్జ లేదా సొద్ద రొట్టెలను నువ్వులు అద్ది భోగి పండుగ రోజు తప్పనిసరిగా తయారు చేస్తారు. రొట్టెల్లోకి గుత్తి(నూనె ) వంకాయ కూర లేదా చిక్కుడుకాయ కూర వండుతారు.
మరునాడు
మకరసంక్రాతి సందర్బంగా బెల్లంతో గుమ్మడికాయ వంటకం వండుతారు. కొత్తబియ్యంతో బెల్లం కలిపి “పులగం ” వండుతారు.
కొన్ని ఇండ్లల్లో రొట్టెలు జల్ల గంపలు నిండుతాయి. ఆరోజు ఇంటికి ఎవ్వరు వచ్చినా నువ్వుల రొట్టెలతో ఆతిథ్యము ఇస్తారు. భోగి రోజు చేసిన రొట్టెలను కనుమ రోజు మాంసాహారంలోకి కూడా మిగుల్చుకుంటారు. అంతేకాదు , కొన్ని కుటుంబాలు ధనుర్మాసం మొత్తం సద్ద రొట్టెలు చేస్తారు అంటే రొట్టెలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు గ్రామాల్లో సద్ద రొట్టెలు చేయడం సామూహికంగా కొనసాగేది. చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు కలసి ఆడుతూ పాడుతూ ఉమ్మడిగా రొట్టెలు చేసుకునేవాళ్ళు. పండుగ వచ్చిందంటే పిండి మరల దగ్గర జనాలు సద్దలపిండి పట్టించుకోవడం కోసం వరుసలు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ హడావిడి కొంత తగ్గినప్పటికి, రొట్టెల సంప్రదాయం మాత్రం ఎప్పటిలా కొనసాగుతూనే ఉంది.
సజ్జ రొట్టెలు నువ్వులు ఆరోగ్యం రీత్యా కూడా మంచి పోషక విలువలతో కూడినవి. ఇతర ప్రాంతాల్లో వారికి ఈ రొట్టెల సంప్రదాయం దాదాపుగా తెలియదు. టీవీ మాధ్యమాల్లో కూడా సంక్రాంతి అంటే సకినాల పండుగ అని వివరిస్తుంటారు. కానీ రొట్టెలు చేసుకునే ప్రాంతాల్లో కొందరికి సకినాలు పరిచయం లేదు. రాయలసీమ ప్రాంతంలో ఇతర శుభకార్యాల్లో చకినాలుగా వండుకుంటారు.
ఇదే రోజు ఈ ప్రాంతాలలో భోగి పులకను కూడా పాటిస్తారు. రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేయడమే భోగిపులక. అదివరకే ధాన్యలక్ష్మి ఇంటికి చేరి ఉంటుంది. ఆ పంట పూర్తయిన తర్వాత మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో ఆ విధంగా ముహూర్తంగా నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. భోగ భాగ్యాలను ప్రసాదించేదే భోగి పండుగ. అందుకే రైతులు భోగిపులక వేస్తూ భూలక్ష్మికి సద్ద రొట్టెలను ప్రసాదంగా సమర్పించుకుంటారు.

✍️ తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

