తెలంగాణాలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపోస్తున్న పరిస్థితుల్లో.. ఈ మత్తు ‘దందా’లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల కుమారులను ఈగల్ టీం అరెస్ట్ చేసిన ఘటన పెను సంచలనం కలిగిస్తోంది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ లో జరిగినట్లు పేర్కొంటున్న డ్రగ్స్ పార్టీ కేసులో తాజాగా ఆర్ముడ్ రిజర్వు విభాగానికి చెందిన డీసీపీ (ఎస్పీ హోదాగల అధికారి) కుమారుడు మోహన్ ను మంగళవారం ఈగల్ టీం అరెస్ట్ చేసింది.
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావు కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. రాహుల్ తేజ మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి డ్రగ్స్ దందా నడిపినట్లు ఈగల్ టీం గుర్తించింది. అంతేకాదు గత నెలలో నిజామాబాద్ లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులోనూ రాహుల్ తేజ సూత్రధారిగా, మూడో నిందితునిగా ఉన్నప్పటికీ అతనిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంపై సహజమైన అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. రాహుల్ తేజను అరెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్ లో మాత్రమే పేరును చేర్చినట్లు ఈగల్ టీం గుర్తించింది. మొత్తంగా మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల పుత్రరత్నాలు ఉండడం సంచలనంగా మారింది.
