Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

డెస్క్ జర్నలిస్టులపట్ల సర్కారుకు ఇంత కర్కశం అవసరమా?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా.. రెండేళ్లపాటు సుదీర్ఘంగా పాత కార్డులనే పొడిగించుకుంటూ పోయింది గతంలో ఏ ప్రభుత్వాల హయాంలో ఇలా జరగలేదు.

ప్రభుత్వం ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ఓ పెద్ద కసరత్తే చేస్తోంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఆయా సంఘాల నేతలతో చర్చలు జరుపుతుంది.‌ ఏదీ మెరుగ్గా ఉంటుందో ఒకటికి రెండుసార్లు సమీక్షిస్తుంది. ఆపై ఓ సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది. అవసరమైతే మార్పులు చేర్పులు కూడా చేస్తోంది. గతంలో‌ ఉన్న దానికి మెరుగులు అద్దుతుంది. కానీ.. కోత పెట్టదు.

అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరిట జరిగి‌న ఈ వర్గీకరణకు ముందు ఎలాంటి కసరత్తు జరిగింది? ఏ జర్నలిస్టు సంఘాన్నానైనా తమ అభిప్రాయం చెప్పమని అడిగారా? ఏదైనా సమావేశం ఏర్పాటు చేశారా? సమాచార శాఖలో దీనిపై ఏ చర్చ అయినా జరిగిందా?

గతంలో ఏడాదికి, రెండేళ్లకోసారి ఇచ్చే కార్డుల విషయంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, యూనియన్లు, పెద్ద, చిన్న పత్రికల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రతినిధులను పిలిచేవారు. మరి కార్డుల వర్గీకరణ లాంటి ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నప్పుడు… ఏ యూనియన్ నుంచైనా, పెద్దా చిన్న పత్రికల నుంచి, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారా, వారిని సమావేశాలకు పిలిచారా?

ఒకరో ఒక్కరిద్దరు జర్నలిస్టు సంఘాల నేతల సొంత అభిప్రాయాలు… ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలుగా మారడం వెనుక మర్మమేంటి?

రైతు భరోసా, సామాజిక భద్రత పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్, కల్యాణ లక్ష్మి… ఇలా ఆయా లబ్ధిదారులకు అందే సాయం పెంపు విషయంలో గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ఇవ్వాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం… కేవలం ఓ పది వేల లోపు సంఖ్యలో ఉండే డెస్క్ జర్నలిస్టుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందా ? కార్డుల వర్గీకరణ సమాచారం సీఎం, సంబంధిత శాఖ మంత్రికి తెలిసే జరిగిందా ?

మీడియా కార్డులతో ప్రభుత్వ సంక్షేమ‌ పథకాల్లో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో స్పష్టమైన ప్రకటన చేయలేదు. జవహర్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకొని డబ్బులు చెల్లించిన వారికి సొంతింటి‌కల అందని ద్రాక్షలాగే మిగిలింది. అప్పుడెప్పుడో వారు చెల్లించిన డబ్బులతో ఎక్కడ కొంత జాగా కొనుక్కున్నా వారికి కనీసం ఓ‌ కోటి రూపాయల ప్రాపర్టీ అయినా మిగిలి ఉండేది. ఇక హెల్త్ కార్డుల విషయానికొస్తే… ఎన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ కార్డులతో వైద్యం జర్నలిస్టులకు అందుతుందో చెప్పనవసరం‌ లేదు.

ఏ జర్నలిస్టు అయినా పెద్ద పెద్ద సౌలత్ లు కావాలని కోరుకోవడం లేదు. ఉండటానికి సొంత గూడు, మెరుగైన వైద్యం, పిల్లలకు మంచి చదువులు… ఇవే వారి ప్రాధాన్యాంశాలు.

ఎడిషన్ సెంటర్లలో పనిచేసే జర్నలిస్టుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు చెందిన వారే. సొంతూరి నుంచి రాకపోకలు సాగించేవారు, వారానికో, రెండు వారాలకో ఇంటికిపోయేవారు ఉంటారు. వారికందుతున్న ఆర్టీసీ బస్ పాస్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం నిజంగా ప్రభుత్వానికి ఉందా? దీని వెనుక ఎవరి సొంత ఎజెండా ఉందో ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. మహిళలకు జారీ చేస్తున్న జీరో టికెట్ మాదిరిగా జర్నలిస్టులకు కూడా ఈ తరహా టికెట్ ఇస్తే.. ప్రభుత్వంపై పడే భారమెంతో తెలుస్తుంది కదా?

ఎవరో కొందరు జర్నలిస్టులనో, సంఘాల నేతలను దృష్టిలో‌ పెట్టుకొని అందరు జర్నలిస్టుల జీవితాలను ఫణంగా పెట్టే చర్యల విషయంలో ప్రభుత్వం‌ పునరాలోచన చేయాలి.‌

Popular Articles