సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు మన కళ్ల ముందుకు వస్తుంటాయి. వాటిని చూసిన కొన్ని క్షణాల్లోనే మనం మరిచిపోతుంటాం. కానీ కొన్ని వీడియోలు మాత్రం మరువలేకుండా ఉంటాయి. వాటిలో ఎలాంటి పెద్ద కథ లేకపోయినా, మన మనసులో మాత్రం అలా నిలిచిపోతాయి. అలాంటి వీడియోల్లో ప్రత్యేకంగా చెప్పుకునే వీడియో ఇది. చాయ్ గ్లాస్ చేతిలో పట్టుకుని, పళ్ళు మొత్తం కనిపించేలా పకపకా నవ్వుతున్న ఒక యువకుడి వీడియో ఈ కోవలోకే వస్తుంది.
ఆ నవ్వు చూస్తే ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు తప్పక మెరుస్తుంది. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఆ నవ్వు కథ ఏమిటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇంతకీ ఎవరీ అబ్బాయి..?
తన నవ్వుతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ యువకుడి పేరు అరుణ్. చాలామంది అనుకుంటున్నట్లు, ప్రచారం జరుగుతున్నట్టు అరుణ్ కర్ణాటకకు చెందినవాడు కాదు. తెలంగాణాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మాలపల్లి (నలపుచ్చటవల్లి) గ్రామానికి చెందిన సాధారణ యువకుడు. వృత్తిరీత్యా అరుణ్ ఒక లారీ క్లీనర్. ఈ వైరల్ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి లారీ డ్రైవర్ పేరు నెహ్రూ. అయితే ఇది ముందే ప్లాన్ చేసి తీసిన వీడియో కాకపోవడం విశేషం. పూర్తిగా అనుకోకుండా రికార్డ్ అయిన ఒక సహజ క్షణం మాత్రమేనట.

ఆ నవ్వు వెనుక కథ:
ఒక రోజు అరుణ్ టీ తాగుతున్న సమయంలో డ్రైవర్ నెహ్రూ సరదాగా ఒక జోక్ చెప్పాడు. ఆ మాట విని అరుణ్ తనను తాను ఆపుకోలేక పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. ఆ సహజమైన నవ్వు నెహ్రూ దృష్టికి ప్రత్యేకంగా అనిపించి, తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అంతే…
ఆ వీడియో కేవలం ఒకటిన్నర నెలల్లోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. మీమ్‌లకు, కామెడీ వీడియోలకు ఆ నవ్వు ఒక గుర్తులా మారిపోయింది. ప్రస్తుతం ఏ మీమ్ చూసినా, ఆ నవ్వు వినిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు.
కష్టాల నుంచి కీర్తి వరకు:
అరుణ్ జీవితం ఈ ఒక్క వీడియోకు ముందు అంత సులభంగా సాగలేదు. పేదరికం కారణంగా నాలుగో తరగతిలోనే చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే జీవన పోరాటంలోకి దిగాడు. అయితే డ్రైవర్ నెహ్రూ ప్రోత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడని సమాచారం. ఇది నిజంగా ఆ కుర్రాడి జీవితంలో ఓ కీలక మలుపుగానే చెప్పాలి.
ఈ ఒక్క వీడియోతో అరుణ్ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రస్తుతం తనకంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి, కామెడీ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
చివరగా…
పెద్ద నేపథ్యం కాదు, గొప్ప అవకాశాలు కాదు..
ఒక సహజమైన నవ్వు…
ఒక సాధారణ క్షణం…
ఒక సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చగలవో చెప్పే నిలువెత్తు నిదర్శనం అరుణ్.
నవ్వు కూడా ఒక శక్తి అని నిరూపించిన కథ ఇది.
(సోషల్ మీడియా పోస్ట్)

