Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ఘోర విషాదం, ఆరుగురి దుర్మరణం

శ్రీకృష్ణ శోభాయాత్రలో ఘోర విషాదం అలుముకుంది. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ గోకులే నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్ కారణంగా ఆదివారం రాత్రి ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఇందులో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంకో నలుగురు తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం వారిని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వాహనం ఆగిపోయింది. దీంతో ఓ పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో రథంపైన గల కరెంట్ ఎక్స్ టెన్షన్ వైర్లు రథానికి తాకడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో దాదాపు పది మంది విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇందులో ఓల్డ్ రామంతాపూర్ కు చెందిన కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ (21 ), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39) రాజేంద్ర రెడ్డి (45)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ఇతని వివరాలు తెలియాల్సి ఉంది.

డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి:
రామంతాపూర్ గోకులే నగర్‌లో దుర్ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై SPDCL సీఎండీ ముషారఫ్ ద్వారా ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించడం, మరికొంతమంది గాయపడటం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

మృతుల కుటుంబాలకు రూ. 5.00 లక్షల పరిహారం
కాగా గోకులే నగర్ ఘటనలో బాధిత కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. రూ. 5.00 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Popular Articles