(సమీక్ష ప్రత్యేక కథనం)
‘సిరిగోల్డ్’ సంస్థ వివాదంలో ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష హోదాగల బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్ర పదే పదే వినిస్తున్న వాదన ఏమిటో తెలుసా? సిరిగోల్డ్ సంస్థకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపై, తనపై నమోదు చేసిన కేసు విషయంలో ఆ సంస్థ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర వాదన తీరు అత్యంత ఆసక్తికరం. ఆయన చెబుతున్నదేమిటంటే.. తమపై ఫిర్యాదు చేసిన యాసా నాగేశ్వర్ రావు కూడా ‘సిరి గోల్డ్’ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారని, అందువల్ల పోలీసులు చట్టపరంగా తీసుకునే చర్యకు సంస్థపరంగా అతనికీ బాధ్యత ఉంటుందని, ఇంత చిన్న లాజిక్ ను తమ సంస్థపై వార్తా కథనాలు రాస్తున్నవారు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావడం లేదనేది రవీంద్ర చేస్తున్న వాదన.
రవీంద్ర వాదన ప్రకారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యాసా నాగేశ్వర్ రావు ఫొటో కూడా ‘సిరి గోల్డ్’ సంస్థ బ్రోచర్ లో డైరెక్టర్ హోదాలోనే ఉంది. అతని ఫొటో పక్కనే బీజేపీ ప్రస్తుత ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు ఫొటో కూడా ‘డైరెక్టర్’ హోదాలోనే ఉండడం గమనార్హం. అయితే అటు యాసా నాగేశ్వర్ రావుతోపాటు ఇటు నెల్లూరి కోటేశ్వర్ రావు కూడా ‘డైరెక్టర్’ హోదాలోనే ఉన్నట్లు సంస్థ ముద్రించిన కలర్ ఫుల్ బ్రోచర్ లో స్పష్టంగానే కనిపిస్తుండడం అసలు విశేషం. కానీ నెల్లూరి కోటేశ్వర్ రావు యాజమాన్యపు డైరెక్టర్ కాదని, కేవలం మార్కెటింగ్ డైరెక్టర్ మాత్రమేనని రవీంద్ర చేస్తున్న వినూత్న వాదన. రియల్ ఎస్టేట్ సంస్థల తరహాలో బిజినెస్ ప్రమోషన్ కోసం తాము నెల్లూరి కోటేశ్వర్ రావును ‘డైరెక్టర్’గా పేర్కొన్నప్పటికీ, సాంకేతికంగా అది సంస్థపరంగా ఇచ్చిన హోదా కాదనేది కూసంపూడి రవీంద్ర చెబుతున్న నిర్వచనం.

అయితే ఒకే హోదాలో గల ఇద్దరు వ్యక్తుల విషయంలో కూసంపూడి రవీంద్ర చేస్తున్న వాదనలోని నిర్వచనం భిన్నంగా ఉండడమే అసలు ప్రత్యేకత. ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు ‘డైరెక్టర్’ హోదాలో ఉన్నారు కాబట్టి, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం తమ సంస్థలో నమ్మకద్రోహం జరిగినా, ఛీటింగ్ జరిగినా యాసా నాగేశ్వర్ రావుకు కూడా బాధ్యత ఉంటుందని, అతనిపైనా చర్యలు తీసుకోవలసి ఉంటుందని కూసంపూడి రవీంద్ర పదే పదే చెబుతున్న విషయమే కాదు, చేస్తున్న వాదన కూడా. కానీ నెల్లూరి కోటేశ్వర్ రావు మాత్రం బిజినెస్ ప్రమోషన్ తాలూకు ‘డైరెక్టర్’గా ప్రస్తావిస్తుండడమే అతని వాదనలోని స్పెషాలిటీగా పేర్కొనవచ్చు.
ఈ నేపథ్యంలో బషీర్ బాగ్ పోలీసులకు యాసా నాగేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఏముందో ఓసారి పరిశీలిస్తే..
సత్తుపల్లి పట్టణానికి చెందిన కూసంపూడి రవీంద్ర, ఖమ్మానికి చెందిన నెల్లూరి కోటేశ్వర్ రావులు ‘సిరిగోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను ఉప్పల్ లోని జీవీఆర్ సన్ షైన్ బిల్డింగ్, ఉప్పల్ భగాయత్ లో ప్రారంభించారు. సంస్థకు ఎటువంటి నిర్దేశిత అనుమతులు తీసుకోకుండా మాయమాటలు చెప్పి ప్రజల నుంచి డబ్బు వసూళ్లు చేశారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ముఖ్యంగా మహిళలకు బంగారంపై ఉండే మక్కువను ఆసరాగా చేసుకుని దురుద్ధేశంతో వివిధ ప్రచార సాధనాలతో, రంగు రంగుల కరపత్రాలతో, బ్రోచర్లతో ఆకర్షించి వేలాది మందితో అక్రమంగా డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకున్నారు. అయితే చెప్పినవిధంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా, ఎటువంటి విషయాలను చెప్పకుండా డబ్బు చెల్లించినవారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. స్కీంలో చెప్పిన విధంగా ఎటువంటి గోల్డ్ షాప్ పెట్టలేదు. ఇచ్చిన కూపన్లను వినియోగించుకునేందుకు ఎటువంటి వెబ్ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేయలేదు.

ఈ నేపథ్యంలోనే తాను కూడా కూసంపూడి రవీంద్ర, నెల్లూరి కోటేశ్వర్ రావులను నమ్మి సిరిగోల్డ్ స్కీంలో రూ. 15,000 మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టానని, ఇందుకుగాను తనకు ఐడీ నెం. 79105334 తనకు ఇచ్చారని ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. తనలాగే అనేక మంది నుంచి దాదాపు రూ. 15.00 కోట్ల నుంచి రూ. 20.00 కోట్ల వరకు వసూళ్లు చేశారని, తనకు తెలిసనవారు కావడంతో తాను హైదరాబాద్ వెళ్లిన ప్రతీసారి సిరిగోల్డ్ ఆఫీసుకు వెళ్లి అడిగేవాడినని పేర్కొన్నారు. కానీ ఏదేదో చెప్పి పంపేవారని, కొన్ని రోజులుగా ఎటువంటి రాబడులు ఇవ్వకుండా సిరిగోల్డ్ కార్యాలయం తెరవకుండా, కంప్యూటర్ హ్యాక్ అయిందనే కారణం చెబుతున్నారని పేర్కొన్నారు.
దీనివల్ల అమాయులు పెట్టుబడిదారులు తీవ్ర నష్టానికి, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, అమాయక ప్రజల వద్ద నుంచి అక్రమంగా డిపాజిట్లద్వారా డబ్బు వసూల్ చేసి విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాల్లో బినామీల పేరుమీద ఆస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నదని, కావున ఆయా వ్యక్తులపై విచారణ జరిపి బాధితులకు డబ్బు తిరిగి చెల్లించేవిధంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని యాసా నాగేశ్వర్ రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. ఈమేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును సిరిగోల్డ్ సంస్థ డైరెక్టర్ గా , సత్తుపల్లికి చెందిన మరో నాయకుడు కూసంపూడి రవీంద్రను మేనేజింగ్ డైరెక్టర్ గా పేర్కొంటూ, వారిద్దరిపై నమ్మకద్రోహం, ఛీటింగ్ అభియోగాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మొత్తంగా ‘సిరిగోల్డ్’ సంస్థకు సంబంధించి రవీంద్ర పేర్కొంటున్నట్లు ఆ సంస్థ ‘డైరెక్టర్’ హోదాలో గల యాసా నాగేశ్వర్ రావే అసలు ‘గుట్టు’ను చెప్పినట్లు భావించవచ్చు. ఇదే అంశంపై యాసా నాగేశ్వర్ రావు స్పందిస్తూ, తాను సంస్థలో డైరెక్టర్ అయితే అక్కడ జరిగే వ్యవహారాలపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తానని ప్రశ్నించారు. ఒకవేళ తనను డైరెక్టర్ గా అంగీకరిస్తే, సంస్థలో వాటా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాజకీయ లబ్ధికోసం నెల్లూరి కోటేశ్వర్ రావును బిజినెస్ డైరెక్టర్ గా పెట్టుకున్నట్లు రవీంద్ర అంగీకరిస్తున్నాడా? అని యాసా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. కాగా సిరిగోల్డ్ సంస్థతో తనకెటువంటి సంబంధం లేదని వెల్లడించిన బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు అదే సంస్థ బోర్డు సభ్యుల సమావేశంలో పాల్గొన్నట్లు పేర్కొంటున్న ఫొటో ఒకటి లీక్ కావడం అసలు కొసమెరుపు.
(జనం సొమ్ముతో బిజినెస్ చేయాలని బీజేపీ నేతలకు సర్కారు అనుమతులు ఇచ్చిందా?.. సిరిగోల్డ్ కథ ఇంకా ఉంది..)

