Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

కక్కలేక.. మింగలేక.. ‘కందాళ’!

(సమీక్ష ప్రత్యేక కథనం)
కందాళ ఉపేందర్ రెడ్డి.. సరికొత్త పరిచయం అక్కర్లేని ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గం టార్గెట్ గా 2009లోనే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ మరోసారి ప్రయత్నించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సుజాతనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రద్దు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్ నేతగా ప్రాచుర్యం పొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు తన రాజకీయ పయనాన్ని మార్చుకున్నారు. దీంతో అప్పట్లో కందాళ ఉపేందర్ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు.

రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణానంతరం పాలేరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ మార్పులు సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి కందాళ ఉపేందర్ రెడ్డి పొలిటికల్ అడుగులకు సానుకూలంగా మారాయని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నుంచి పోటీచేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై 7,669 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కేటీఆర్ తో కందాళ ఉపేందర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ఉపేందర్ రెడ్డి దాదాపు 57 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయాన్ని చవి చూశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తన ఓటమి అనివార్యమైన పరిస్థితులను ముందే అంచనా వేసుకున్నారో ఏమో తెలియదుగాని, పలు ప్రచార సభల్లో ఉపేందర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఒకటి, రెండు సభలో ఆయన కన్నీటి పర్యంతమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా పాలేరు నియోజకవర్గ రాజకీయంలో ఇప్పటి వరకు కందాళ ఎదుర్కున్న పరిస్థితి.

కానీ తాజాగా ఇప్పుడేం జరుగుతోంది? రాజకీయ అరంగేట్రానికి దారులు పరిచి, టికెట్ ఇచ్చి, గెలిపించిన కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను, నాయకులను మధ్యలోనే వదిలేసి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న కందాళ ప్రస్తుతం ఎదుర్కుంటున్న స్థితిపై సహజంగానే తీవ్ర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ భవితకు అండగా నిలవాల్సిన పార్టీ నాయకులే తన అల్లున్ని ‘టార్గెట్’గా చేసుకుని చేస్తున్న ఆరోపణలపై కందాళ ఉపేందర్ రెడ్డి కిమ్మనడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్ల అంశాన్ని లేవనెత్తుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు సృజన్ రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ గా చేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.

హరీష్ రావు (ఫైల్ ఫొటో)

సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్ల అంశంలో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ గా, సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బామ్మర్దిగా పదే పదే ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ బొగ్గు బ్లాకుల టెండర్ల వ్యవహారం తీవ్ర రూపం దాల్చి చివరికి గవర్నర్ కు ఫిర్యాదు చేసే స్థాయికి బీఆర్ఎస్ నాయకులు వివాదాన్ని తీసుకువెళ్లడం గమనార్హం. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ వివాదాంశంలో పదే పదే ప్రస్తావిస్తున్న సృజన్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చిన్నల్లుడు కావడం ఈ సందర్భంగా గమనార్హం.

ఉపేందర్ రెడ్డి చిన్న కూతురు దీప్తిరెడ్డి భర్తే సృజన్ రెడ్డి అనే విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా మీడియా సమావేశాల్లో గుర్తు చేశారు. సృజన్ రెడ్డి అనే వ్యక్తికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టులు ఎక్కువగా దక్కాయని కూడా భట్ట విక్రమార్క తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అయినప్పటికీ అటు కేటీఆర్, ఇటు హరీష్ రావులు సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ‘బామ్మర్ది’ అని మాత్రమే మీడియా ముందు గొంతెత్తుతుండడం విశేషం.

ఈ పరిస్థితుల్లో తన సొంత అల్లుడైన సృజన్ రెడ్డిని ‘టార్గెట్’గా చేస్తూ బీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న ఆరోపణలపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాత్రం బాహాటంగా ఎక్కడా పెదవి కదపడం లేదు. అంతర్గత చర్చల్లో మథనపడుతున్నారో, లేదో తెలియదు. నిజానికి దాదాపు ఏడాది క్రితం నుంచే సృజన్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. అమృత్ టెండర్ల నుంచి ప్రస్తుత సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్ల వరకు సీఎం రేవంత్ రెడ్డి ‘బామ్మర్ది’ అంటూ కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడినే ప్రధాన అస్త్రంగా ఎంచుకుని సీఎంపై ఆరోపణలు గుప్పిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్ తో కందాళ ఉపేందర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

ఈ పరిస్థితుల్లో కందాళ ఉపేందర్ రెడ్డి తన అల్లుడు సృజన్ రెడ్డి ‘టార్గెట్’గా కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న ఆయా ఆరోపణల అంశాలపై ఏరకంగానూ స్పందించకపోవడంపై భిన్న చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతారని, పాలేరు నుంచి అదే పార్టీ నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతారనేది ఆయా చర్చకు సంబంధించిన సారాంశం. ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని, దీంతో కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు మార్గం సుగమమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తాను పాలేరును వదిలే ప్రసక్తే లేదని, కొత్తగూడెం వెడతాననే ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ బొగ్గు బ్లాకుల టెండర్ల వివాదంలో సృజన్ రెడ్డి ‘టార్గెట్’ గా బీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న వివాదంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పందించకపోవడంతో పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జోరుగా సాగుతుండడం విశేషం. మొత్తంగా ఈ అంశంలో ఓవైపు అల్లుడు, ఇంకోవైపు పార్టీ.. వెరసి కందాళ ఉపేందర్ రెడ్డి పరిస్థితి కక్కలేక.. మింగలేక.. చందాన తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం కొసమెరుపు.

Popular Articles