ఖమ్మం: ఖమ్మం రియల్ ఎస్టేట్ రంగంలోకి మరో సంస్థ ప్రవేశించింది. సినీరంగంలో ఏళ్లతరబడి అనుంబంధాన్ని పెనవేసుకున్న శ్రేయస్ మీడియా సంస్థ తొలిసారి రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించింది. తన రియల్ వ్యాపారానికి ఖమ్మం నగరాన్ని శ్రేయస్ సంస్థ కేంద్రంగా ఎంచుకుంది. ఇందులో భాగంగానే నగర శివారల్లోని వందనం గ్రామం రోడ్డులో ‘శ్రేయస్ వన్ సిటీ’ పేరుతో వెంచర్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది.
సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి, సింగర్ సునీత బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సందడి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ఆధ్వర్యంలో “శ్రేయస్ వన్ సిటీ” బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగర అభివృద్ధికి నూతన దిశను సూచించే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఉత్సాహభరితంగా, సందడిగా సాగిందని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. యువత హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గొని అభిమానులను అలరించారు. వారి సందడి, అభిమానులతో సెల్ఫీలు, నవ్వులు కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. అదే విధంగా, సినీ గాయని సునీత తన మధుర గాత్రంతో, సినీ గేయాలతో సభను ఉర్రూతలూగించారు. ఆమె పాటలకు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాగా శ్రేయస్ వన్ సిటీ ప్రాజెక్ట్ ఆధునిక సదుపాయాలతో, నూతన జీవన విధానానికి తగిన విధంగా రూపుదిద్దుకుంటుందని సంస్థ నిర్వాహకులు శ్రేయాస్ శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్ నగర రూపకల్పనలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

