ఢిల్లీ: తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లాను కేంద్రం నియమించింది. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ ఆకస్మికంగా రాజీనామా చేసిన పరిణామాల్లో కేంద్రం పలు రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించడం గమనార్హం. ఇందులో ముగ్గురిని కొత్తగా గవర్నర్లుగా నియమించగా, పలువురికి స్థానచలనం కల్పిస్తూ, ఒకరిద్దరికి అదనపు బాధ్యతను అప్పగించింది. వివరాలు ఇవీ:
- తెలంగాణా గవర్నర్ గా నియమితులైన శివ్ ప్రతాప్ శుక్లాను హిమాచల్ ప్రదేశ్ నుంచి బదిలీ చేశారు.
- తెలంగాణా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణా నుంచి బదిలీ చేస్తూ మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు.
- తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ కు బదిలీ చేశారు.
- లడ్హాక్ గవర్నర్ కవిందర్ గుప్తను హిమాచల్ ప్రదేశ్ కు మార్చారు.
- ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లడ్హాక్ కు బదిలీ చేశారు.
- కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కు తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఇక నాగాలాడ్ గవర్నర్ గా నందకిషోర్ యాదవ్ ను, బీహార్ గవర్నర్ గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్ ను, ఢిల్లీ గవర్నర్ గా తరణ్ జిత్ సింగ్ సింధును నియమించారు.

