తన బాయ్ ఫ్రెండును చంపిన కేసులో ఓ యువతికి కేరళ కోర్టు మరణశిక్షను విధించింది. ఇందుకు సహకరించిన సమీప బంధువుకు కూడా మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువనంతపురం కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. గ్రీష్మ అనే యువతి తన బాయ్ ఫ్రెండు షారోన్ రాజ్ కు కూల్ డ్రింకులో విషయం కలిపి చంపింది. వివరాల్లోకి వెడితే..
షారోన్ రాజ్, గ్రీష్మలు పరస్పరం ప్రేమించుకున్నారు. ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రియురాలు గ్రీష్మ పథకరచన చేసింది. ఇదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ షారోన్ రాజ్ కు చెప్పిన గ్రీష్మ తనతో సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరింది. ఇందుకు షారోన్ రాజ్ నిరాకరించడంతో 2022 అక్టోబర్ 14వ తేదీన తన పుట్టిన రోజు పేరుతో షారోన్ ను తన ఇంటికి ఆహ్వానించి, కూల్ డ్రింకులో విషయం కలిపి ఇచ్చింది. దాదాపు 11 రోజులపాటు మృత్యువుతో పోరాడిన షారోన్ రాజ్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ కేసులో వాద, ప్రతివాదనలు విన్న కోర్టు నిందితురాలు గ్రీష్మను దోషిగా నిర్ధారిస్తూ ఆమెకు మరణ శిక్షను విధించింది. ఇందుకు సహకరించిన గ్రీష్మ సమీప బంధువు నిర్మలా కుమారన్ నాయర్ కు మూడేళ్ల కారాగార శిక్షను విధించింది. ఈకేసులో గత వారమే కోర్టు గ్రీష్మను దోషిగా నిర్ధారించి సోమవారం అంతిమ తీర్పునిచ్చింది. అప్పట్లో కేరళలో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది