హైదరాబాద్: తెలంగాణాలో పోస్టల్ సేవలకు మంగళవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోస్టల్ శాఖకు చెందిన సర్వర్ మొరాయిస్తున్న కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి తెలంగాణా వ్యాప్తంగా పోస్టల్ సర్వీసులు స్తంభించినట్లు సమాచారం. ముఖ్యంగా బుకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి. మంగళవారం ఉదయం పది గంటల నుంచి సమస్య తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోస్టల్ సేవలు, ముఖ్యంగా బుకింగ్స్ వంటి కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగినట్లు ధ్రువపడిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
అయితే ఈ సమస్య తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు పోస్టల్ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సర్వర్ మొరాయిస్తున్న కారణంగా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్టు వంటి బుకింగ్స్ నిలిచిపోయాయి. గత ఆదివారం నుంచి కూడా ఐటీ 2.0 అనే సర్వర్ సేవల్లో తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆర్ఎంఎస్ సర్వీసులకు ఇబ్బంది కలిగింది. సోమవారం కూడా సమస్య ఏర్పడినప్పటికీ, మంగళవారం ఎదురైన తరహాలో బుకింగ్స్ వంటి పోస్టల్ సేవలు పూర్తిగా స్తంభించలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. గంట వ్యవధిలో సమస్య పరిష్కారమవుతుందని సాంకేతిక వర్గాలు చెబుతున్నప్పటికీ, సాయంత్రం 4.00 గంటల వరకు కూడా పరిస్థితితిలో మార్పు రాలేదని పోస్టల్ ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

