Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

గుడిలో తొక్కిసలాట, ఏడుగురి దుర్మరణం

కాశీబుగ్గ: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. ఇదే దుర్ఘటనలో మరో ఐదుగురు స్పృహ తప్పి పడిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురూ మహిళలే. కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడం తొక్కిసలాటకు కారణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. దేవాలయ సామర్థ్యం రెండు నుంచి మూడు వేల మంది మాత్రమే కాగా, 25 వేల మందికిపైగా తరలివచ్చినట్లు సమాచారం. కార్తీక ఏకాదశికి అదనంగా శనివారం కావడంతో వెంకన్న దర్శనం కోసం ఇంత భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలోని రెయిలింగ్ విరగడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడి తొక్కిసలాటకు దారితీసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు దిగ్భ్రాంతి:
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉదంతం తనను కలచివేసిందని, ఈ దురదృష్టకర ఘటనలో పలువురు భక్తులు మరణించడం అత్యంత విషాదకరంగా చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారికి మెరుగైన సత్వర చికిత్స అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. అదేవిధంగా హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు కూడా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

Popular Articles