పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 2.00 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి జస్టిస్ కె. ఉమాదేవి గురువారం సంచలనం తీర్పునిచ్చారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఇందుకు సంబంధించిన కేసు పూర్వాపరాలను వివరించారు.
కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన బానోత్ రాములు (50) అనే వ్యక్తి 2023 ఆగస్టు 15వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలిక వద్దకు వెళ్లి తన మాయమాటలతో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కూసుమంచి పోలీసులు బానోత్ రాములుపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు నిర్వహించి సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జిషీట్ ను దాఖలు చేశారు.

కేసులో వాద, ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి సాక్ష్యాధారాలను, వైద్య నివేదికను పరిశీలించి బానోత్ రాములును దోషిగా నిర్ధారించారు. దీంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రాములుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిాక్షతోపాటు రెండు లక్షల రూపాయలను జరిమానాగా విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ మహ్మద్ ఇర్సాద్ వాదించగా, కేసులో నిందితునికి శిక్ష పడేవిధంగా విధులు నిర్వహించిన అప్పటి రూరల్ ఏసీపీ భాస్వరెడ్డి, ప్రస్తుత ఏసీపీ తిరుపతి రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ , భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ గోపికృష్ణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు, హోంగార్డు చిట్టిబాబులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.