Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ వారిక 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయాల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. ఉమాదేవి తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జన కోసం గద్వాలకు చెందిన మల్లేష్ అలియాస్ నాయక్, కోరుట్లకు చెందిన గడ్డం భువన్ అలియాస్ యెరుగుంట్ల రవితేజ, రంగారెడ్డి జిల్లా దుండిగల్ ప్రాంతానికి చెందిన ఇషాక్ అనే వ్యక్తులు 2021 ఏప్రిల్ 28వ తేదీన గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం నుండి కారులో రూ. 30 లక్షల విలువ చేసే 200 కేజీల గంజాయిని ఆయా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తూ ఖమ్మం సమీపంలోకి చేరుకున్నారు. అయితే వి. వెంకటపాలెం వద్ద పోలీస్ చెక్ పోస్టు ఉందని గుర్తించిన వ్యక్తులు వేగంతో కారు నడుపుకుంటూ ప్రయాణికులతో కూడిన ఆటోను బలంగా ఢీ కొట్టడంతో ఆటోతోపాటు కారు కూడా బోల్తా పడ్డాయి. ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన ఆటో ప్రయాణికుడిని మార్చురీకి, గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు.

అనంతరం కారును నిశితంగా పరిశీలించగా అందులో 200 కేజీల 100 గంజాయి ప్యాకెట్లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఈ సమయంలో కారులో గల మల్లేష్, గడ్డం భువన్ అనే వ్యక్తులు పట్టుబడగా, ఇషాక్ పరారయ్యాడు. ఘటనపై నిందితులపై రఘునాథపాలెం పోలీసులు క్రైం నెం. 87/2021 ద్వారా ఐపీసీ 304(A), 338, 337, ఎన్ డీ పీఎస్ చట్టం 1985లోని 8(c) R/w 20(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాల పరిశీలన, వాద, ప్రతివాదనల అనంతరం నిందితులను దోషులుగా న్యాయమూర్తి నిర్ధారించారు. ముగ్గురిలో ఇషాక్ అనే నిందితుడు పరారీలో ఉండగా, మల్లేష్, భువన్ లకు ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 2.00 లక్షల చొప్పున జరిమాన విధిస్తూ జస్టిస్ ఉమాదేవి తీర్పును వెలువరించారు.

కేసులో ప్రాసిక్యూషన్ కు సహకరించిన విచారణ అధికారులు అప్పటి సీఐ పి. సత్యనారాయణ రెడ్డి, ప్రస్తుత ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్, జె. శరత్ కుమార్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్, సాంబశివ రావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్, హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ. ఆయూబ్ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ సందర్భంగా అభినందించారు.

Popular Articles