సోషల్ మీడియా ప్రాబల్యం బీభత్సంగా పెరిగిపోయాక అసలు కంటెంట్ ఎవరిదో? కాపీ కంటెంట్ ఎవరిదో? తెలియని అయోమయ స్థితి నెలకొంది. రాతల్లో కాస్త చేయి తిరిగినవారు తమ కంటెంట్ ను ఏ ఫేస్ బుక్ వాల్ పైనో, సోషల్ మీడియాకు చెందిన ఇతర వేదికలపైనో రాసుకున్నదే తడవుగా సదరు ‘కంటెంట్’ను తస్కరించడంలో చాలా మంది రాటుదేలిపోయారనేది బహిరంగం. నిజానికి ఎవరైనా సొంతంగా రాసుకున్న కంటెంట్ ను ఇతరులు వాడుకునే ముందు సంబంధిత రచయిత, లేదా రాసిన వ్యక్తి అనుమతి తీసుకుని దాన్ని వాడుకోవడం సంప్రదాయం. లేదంటే ఫోన్ ద్వారా అనుమతి తీసుకోవడం కనీస మర్యాద. గతంలో నవలలకు, పత్రికలకు వ్యాసాలు, కథలు రాసి ప్రచురణ కోసం పంపేవాళ్లు ‘ఇవి తన సొంత రాతలని, ఎక్కడా కాపీ చేయలేదు’ అని పబ్లిషర్లకు హామీ పత్రం రాసిచ్చే ఆనవాయితీ ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియాలో గుర్తింపు పొందడానికి, లేదా జర్నలిస్లులుగా చెలామణిలో ఉండడానికి ఇతరుల కంటెంట్ ను క్షణాల్లో కాపీ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. దీంతో అసలు రాతగాళ్లకన్నా కాపీ రాయుళ్ల పోస్టులే ‘తామర’ తరహాలో అత్యంత వేగంగా జనంలోకి వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పుడీ విషయ ప్రస్దావన దేనికంటే..? బీటీ గోవిందరెడ్డి అనే ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉన్నారు. ప్రముఖ పత్రికల్లో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది. కొన్ని న్యూస్ ఛానళ్లను కూడా ఆయన విజయవంతంగా నడిపారు. గోవిందరెడ్డి రాసిన రెండు ఆర్టికల్స్ ను ఓ వెబ్ సైట్ నిర్వాహకుడు ‘కట్ పేస్ట్’ తరహాలో వాడేసుకున్నాడు. ఇది చూసిన గోవిందరెడ్డి మనసు చివుక్కుమన్నట్టుంది. అందుకే కాబోలు తన ఫేస్ బుక్ వాల్ పైనే వెబ్ సైట్ నిర్వాహకుని నిర్వాకాన్ని వేలెత్తి చూపారు.

సీనియర్ జర్నలిస్ట్ బీటీ గోవిందరెడ్డి ఈ అంశంపై తొలుత కాస్త మర్యాదగానే వెబ్ సైట్ నిర్వాహకుని చర్యను బహిరంగపరుస్తూ, తన పోస్టులను కాపీ చేసి పెట్టొద్దని కోరారు. ఆ తర్వాత కాసేపటికి ఫలానా వ్యక్తి తన పోస్టులను దొంగిలించారని, ఇటువంటి కాపీరాయుళ్లకు ఎలా ‘హితవు’ చెప్పాలో సూచించాలని తన ఫాలోవర్స్ ను కోరారు. ఈ పరిణామాల తర్వాత సదరు వెబ్ సైట్ నిర్వాహకుడు తన ‘నిర్వాకాన్ని’ పాఠకులకు కనిపించకుండా పబ్లిష్ చేసిన పోస్టులను తొలగించడం విశేషం. పబ్లిష్ చేసిన ఆయా పోస్టులను సదరు వెబ్ సైట్ నుంచి దాని నిర్వాహకుడు తొలగించిన తర్వాత, తన పోస్టులు చోరీకి గురైనట్లు తాను పెట్టిన పోస్టులను కూడా బీటీ గోవిందరెడ్డి తన ఫేస్ బుల్ వాల్ నుంచి తీసేయడం కొసమెరుపు.
సీనియర్ జర్నలిస్ట్ బీటీ గోవిందరెడ్డి తన పోస్టులు కాపీ చేసిన వెబ్ సైట్ పేరును నేరుగానే ప్రస్తావిస్తూ, దాని నిర్వాహకునిపై ఫేస్ బుక్ వాల్ పై పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జర్నలిస్టు సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై బీటీ గోవిందరెడ్డి పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లను దిగువన మీరూ చూడవచ్చు.

