నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు ఊరట లభించనుంది. ఇందులో భాగంగానే సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను శనివారం విడుదల చేశారు. ఆశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి నీరు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యంతో పంటలు ఎండకుండా సాగు నీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నుంచి జలాలను విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం కోరిందే తడవుగా సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదల చేసినందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వఱ్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించారు. నగరంలోని వైఎస్సార్ నగర్ లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని రెండెకరాల స్థలంలో ఆర్కానట్ (వక్క) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


అదేవిధంగా రఘునాథపాలెం మండలం కేవీ బంజరలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. గ్రామంలో గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలను ఎంపిక చేసి వారికి 5 లక్షల రూపాయల సహాయం అందించి సొంత ఇళ్ళు నిర్మాణం చేసే విధంగా అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.