ఛత్తీస్ గఢ్ అడవుల్లో నక్సల్స్ ఏరివేతలో పాల్గొంటున్న భద్రతా బలగాలకు అనూహ్య దృశ్యం ఎదురవుతోంది. ఈ సరికొత్త దృశ్యాన్ని ఆనవాళ్లు లేకుండా చేసేందుకు భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నది తుపాకులు కాదు, తుపాకీ గొట్టం నుంచి నుంచి నిప్పులు కక్కే తూటాలు కాదు. గొడ్డళ్లను చేబూని సరికొత్త దృశ్యపు ఆనవాళ్లను చెరిపేందుకు చేస్తున్న ప్రయత్నం విప్లవోద్యమ పరిశీలకుల్లో చర్చకు దారి తీసింది. ఆ ఆసక్తికర దృశ్యపు వివరాలను తెలుసుకునే ముందు క్లుప్తంగా వర్తమాన పరిణామాలను ఓసారి మననం చేసుకుంటే..
వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం పదే పదే పునరుద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయుధాలను చేబూనిన మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని, ఆపరేషన్ కగార్ ను నిలిపేసే ప్రసక్తే లేదని కేంద్రంతోపాటు ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పాలకులు సైతం స్పష్టం చేస్తున్న విషయం కూడా విదితమే. భద్రతా బలగాల గాలింపు చర్యలు, నిర్వహిస్తున్న వరుస ఆపరేషన్ల ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు అనేక మంది ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు కూడా. ఇదే దశలో వందలాది మంది నక్సలైట్లు ‘లొంగుబాట’ను కూడా ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే విప్లవోద్యమ అభిమానులతోపాటు కమ్యూనిస్టు పార్టీలు, పలువురు మేధావులు ఛత్తీస్ గఢ్ లో ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన ముఖ్యులు సైతం మావోలతో చర్చలు జరపాలని కోరుతున్నారు. శాంతి చర్చల కోరికపై, డిమాండ్లకు కేంద్రంతోపాటు ఛత్తీస్ గఢ్ బీజేపీ పాలకులు సైతం ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ లోని తీవ్రవాద ప్రాబల్యం గల నారాయణ్ పూర్, దంతెవాడ, బీజాపూర్, కాంకేర్, సుక్మా తదితర జిల్లాల్లో భద్రత బలగాలు నక్సల్స్ ఏరివేతతోపాటు వారి ఆనవాళ్లను సైతం లేకుండా చేస్తున్నాయి. అబూజ్ మడ్, కర్రెగుట్ట, నేషనల్ పార్క్ వంటి కీలక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్లలో భద్రతా బలగాలు భారీ విజయాలనే సాధిస్తున్నాయి. ఇదే దశలో గతంలో నక్సల్స్ నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాలను కూల్చేసిన ఘటనలు అనేకం. కాంక్రీట్ పదార్థాలతో గతంలో నిర్మించిన భారీ స్థూపాలను పేల్చేసిన, గునపాలతో కూల్చేసిన ఘటనలు అనేకం.

అయినప్పటికీ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ అడవుల్లో సరికొత్త రీతిలో నక్సల్స్ ‘స్మారక స్థూపాలు’ కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్న పరిస్థితుల్లో, పరిణామాల్లోనూ ఈ సరికొత్త దృశ్యం సాక్షాత్కరిస్తుండడమే అసలు విషయం. ఇక్కడున్న ఫొటోలను ఓసారి నిశితంగా పరిశీలించండి. ఇప్పచెట్ల ముందు భాగాన ఎర్ర రంగులో కనిపిస్తున్న శిలల వంటి ఆకృతులు రాళ్లు, కంకర, సిమెంట్ లతో నిర్మించినవి ఏమాత్రం కావు. భారీ వృక్షాలనే ‘స్మారక స్థూపాలు’గా మార్చిన దృశ్యమిది. పచ్చని అడవుల్లో చెట్లనే స్మారక స్థూపాలుగా మారుస్తున్న తీరుకు భద్రతా బలగాలు సైతం నివ్వెరపోతున్నాయట. సిమెంట్, కంకర, రాళ్లతో స్థూపం నిర్మించడం ఇప్పుడున్న నిర్బంధ పరిస్థితుల్లో అసాధ్యమని భావించిన మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీలు ఒకటి, రెండు రోజుల్లోనే చెట్లను ఇలా అమరవీరుల ‘స్మారక స్థూపాలు’గా చెక్కుతున్నాయట.

నక్సలైట్ల గాలింపు చర్యల్లో భాగంగా ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు తాళ్లతో వీటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కూల్చివేత సాధ్యంకాని పరిస్థితుల్లో గొడ్డలి చేబూని వాటిని నరికేస్తున్నారు. ఈ సరికొత్త స్మారక స్థూపాల దృశ్యాలపై విప్లవోద్యమ పరిశీలకులతోపాటు కమ్యూనిస్టు పార్టీలు కూడాా తమదైన శైలి భావనను వ్యక్తీకరిస్తుండడం గమనార్హం. ‘విప్లవకారులను భౌతికంగా నిర్మూలించవచ్చుగాని, విప్లవాన్ని నిర్మూలించలేరని, దాని భావజాలాన్ని రూపుమాపలేరు’ అనే వాదనను విప్లవోద్యమ అభిమానులు ఈ సందర్భంగా వినిపిస్తున్నారు. సమాజంలో దోపిడీ, అసమానతలు ఉన్నంతకాలం విప్లవం ఉంటుందని, దాని భావజాలం కూడా బతికే ఉంటుందని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఛత్తీస్ గఢ్ అడవుల్లోని తాజా స్థూపాల దృశ్యాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా దంతెవాడ జిల్లా ఖహ్చెనార్ సమీపంలో నక్సలైట్లు నిర్మించిన మూడు స్మారక స్థూపాలను భద్రతా బలగాలు తనిఖీల్లో గుర్తించినట్లు మాలెవాహి పోలీసులు ప్రకటించారు. మూడింటిలో రెండు చెక్కతో, మరొకటి సిమెంట్ రాయితో తయారు చేయబడ్డాయని, ఆపరేషన్ టీం గొడ్డలి, క్రౌబార్ సహాయంతో వాటిని అక్కడికక్కడే కూల్చివేసినట్లు చెప్పారు. ఈ స్మారక స్థూపాలను గతంలో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, డిప్యూటీ కమాండర్ రాము, జైమాన్, సునీతల పేర్లతో నిర్మించారని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా భద్రతా బలగాలను రెచ్చగొట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తారని, అప్రమత్తతతో తమ బలగాలు నక్సల్స్ యత్నాన్ని తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నట్లు మాలెవాహి పోలీలు వెల్లడించారు.