తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్ధుల్లోని ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ల్లో భద్రతా బలగాలు బుధవారం భారీ విజయాన్ని సాధించాయి. దాదాపు డెబ్బయి కిలోమీటర్ల విస్తీర్ణంలో గల కర్రెగుట్ట అడవులను గడచిన పదహారు రోజులుగా సుమారు 20 వేల మంది భద్రతా బలగాలు మావోయిస్టులే టార్గెట్ గా జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. కర్రెగుట్టల్లోని రెండు గుట్టలను ఇప్పటికే తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న భద్రతా బలగాలు బుధవారం భారీ ఆపరేషన్ ను నిర్వహించాయి. ఈ ఉదయం కర్రెగుట్టల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 25 మంది నక్సలైట్లు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కూడా సమాచారం అందుతోంది.
వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సందర్భానుసారం పునరుద్ఘాటిస్తున్నారు. ఈ పరిణామాల్లోనే నక్సల్స్ తో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతోపాటు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పెద్దలు కూడా తోసిపుచ్చుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, అక్కడి హోం మంత్రి విజయ్ శర్మలు శాంతి చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో 25 మందికి పైగా నక్సలైట్లు మరణించినట్లు వార్తలందుతున్నాయి.

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ వేట సాగిస్తున్న భద్రతా బలగాల్లో అనేక విభాగాల పోలీసులు ఉన్నారు. రాష్ట్ర బలగాలతోపాటు కేంద్ర బలగాలు కూడా నక్సల్స్ వేటలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా DRG, CRPF, COBRA, STF తదితర విభాగాలకు చెందిన పోలీసులు అత్యంత శ్రమకోర్చి కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. అయితే కర్రెగుట్టల్లో నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల చేతుల్లో కనిపించి ఓ అధునాతన ఆయుధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం గమనార్హం. కర్రెగుట్టల దృశ్యాలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ వీడియోలోని అధునాతన ఆయుధం ఆసక్తికర చర్చకు దారి తీయడం విశేషం.

నక్సల్స్ కోసం కూంబింగ్ జరిపే బలగాలు సాధారణంగా ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్), ఏకే-47 వంటి బహుళ ప్రాచుర్యం పొందిన ఆయుధాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అవసరాన్ని బట్టి గ్రెనేడ్లు, మోర్టార్ లాంఛర్ల వంటి ఆయుధ సంపత్తిని కూడా వినియోగిస్తుంటారు. అత్యంత అరుదుగా LMG (లైట్ మెషీన్ గన్)లను వాడుతుంటారు. కానీ తాజాగా కర్రెగుట్టల విజువల్ గా వివిధ న్యూస్ ఛానళ్లలో కనిపించిన ఓ వీడియోలో అడవుల్లో తూటాల వర్షం కురిపిస్తున్న HMG (హెవీ మెషీన్ గన్) కనిపించడం గమనార్హం. SLR లో 20, AK-47లో 30 వరకు మాత్రమే తుపాకీ తూటాలు ఉంటాయి. మ్యాగ్జిన్ల ద్వారా మాత్రమే ఆయా ఆయుధాల్లో తూటాలను నింపి వినియోగిస్తుంటారు.

అరుదుగా వాడే LMG ఆయుధ వినియోగానికి ట్రైపాడ్ తరహాలో స్టాండును వినియోగిస్తుంటారు. అత్యంత బరువైన HMG ఆయుధ వినియోగానికి భారీ స్టాండ్ నే వాడుతుంటారు. HMG ఆయుధాన్ని తూటాలతో కూడిన ‘బెల్ట్’ను సెట్ చేసి వాడుతుంటారు. ఈ తరహా తూటాల బెల్టులో 235 తుపాకీ గుళ్లు అమర్చి ఉంటాయి. HMGకి బెల్టును బిగించి ట్రిగ్గర్ నొక్కితే వరుసగా 235 తూటాలు అయిపోయే వరకు ఎదుటివారిపై తుపాకీ గుళ్లవర్షం కురిపించవచ్చు. ఇటువంటి అధునాతన ఆయుధాలను సాధారణంగా దేశ సరిహద్దుల్లోని భద్రతా బలగాలు మాత్రమే వినియోగిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల వేట కోసం HMG వంటి అధునాతన ఆయుధాలను CRPF బలగాలు మాత్రమే వాడే అవకాశం ఉందని, స్థానిక బలగాల వద్ద HMG వంటి ఆయుధాలు ఉండవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కర్రెగుట్ట అడవుల్లో తిష్టవేసిన మావోయిస్టుల జాడను కనిపెట్టేందుకు పైన డ్రోన్లు సంచరిస్తుండగా, భద్రతా బలగాల చేతుల్లోని HMG వంటి అధునాతన ఆయుధాలు తుపాకీ తూటాల వర్షాన్ని కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాత్రి వేళల్లోనూ స్పష్టంగా కనిపించే లేటెస్ట్ టెక్నాలజీ బైనాక్యులర్స్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ పరిణామాల్లో కర్రెగుట్టల్లో ఉన్నట్లు భావిస్తున్న మావోయిస్టుల వేటలో భద్రతా బలగాలదే పైచేయిగా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు సైతం అంగీకరిస్తున్నారు.