Top 5 This Week

Related Posts

‘పొలిటికల్’ నీడలో ‘డెకాయిట్స్’ ఎక్కడ!? చిక్కింది చిన్నవాళ్లే!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాలా ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయల సైబర్ నేరాల దోపిడీ కేసులో అసలు దోపిడీదార్లకు సహకరించినవాళ్లు మాత్రమే పోలీసులకు చిక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఆశ చూపి, వారిచేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి, అదే అకౌంట్ల ద్వారా సైబర్ నేరాల సొమ్ము లావాదేవీలను నిర్వహించిన అసలు ‘డెకాయిట్లు’ పోలీసులకు ఇప్పటి వరకు చిక్కకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిలో ఒకరు మినహా మిగతా ఐదుగురిని పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. కాగా ఈ ముఠాకు సహకరించినట్లు విచారణలో కనుగొన్న పదిహేడు మందిని మాత్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేయడం విశేషం.

ఏమిటీ సైబర్ దోపిడీ కేసు?:
సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పౌరులకు సైబర్ వల విసిరి దోపిడీకి పాల్పడిన మొత్తపు సొమ్మును రూ. 547.00 కోట్లుగా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో పోలీసులు తేల్చారు.

ప్రతీకాత్మక చిత్రం

ఉడతనేని వికాస్ చౌదరి ముఠా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్థులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహించడం ద్వారా ఈ భారీ దోపిడీకి పాల్పడింది. పెట్టుబడులు, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో ఇన్వెస్టుమెంట్లు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగించి నిరాటంకంగా దోపిడీని కొనసాగించింది. ఎవరైనా వ్యక్తులు వీరి సైబర్ వలకు ఆకర్షితులైతే అతనిని టెలీగ్రామ్ గ్రూపులో సభ్యునిగా చేర్చి, ఆ తర్వాత మోసపూరిత లింక్ లు పంపి, వారి అకౌంటర్ల నుంచి డబ్బును ఖాళీ చేయడం ఉడతనేని వికాస్ చౌదరి ముఠా సాగించిన కార్యకలాపాల సారాంశం.

పోలీసులు అరెస్ట్ చేసిన పోట్రు ప్రవీణ్ (ఫైల్ ఫొటో)

సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా వచ్చిన డబ్బును ముందే ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లలోకి బదలాయించేవారు. ఆ తర్వాత దోచుకున్న డబ్బును కొన్ని కరెంట్ ఖాతాల్లోకి మార్చి, చివరగా తమ పర్సనల్ అకౌంటర్లలోకి ఆ డబ్బును బదలాయించేశారు. తద్వారా అమెరికా డాలర్లలోకి, క్రిప్టో కరెన్సీ రూపంలోకి దోపిడీ సొమ్మును మార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా ఇప్పటి వరకు ఉడతనేని వికాస్ చౌదరి ముఠాకు చెందినవారు దోచుకున్న డబ్బు మొత్తాన్ని రూ. 547 కోట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఆయా డబ్బును తమ ఖాతాల్లోనేగాక, కుటుంబ సభ్యుల, బంధువల ఖాతాల్లో కూడా లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు కనుగొన్నారు.

నిరుద్యోగులకు వల విసిరి..:
ఇటువంటి నేరాలకు పాల్పడిన ఉడతనేని వికాస్ చౌదరి ముఠా నిరుద్యోగులనే తమ దోపిడీకి పావులుగా వినియోగించుకోవడం గమనార్హం. ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగ యువకులను తమ వద్దకు పిలిపించుకుని, వారికో ఉద్యోగం ఇచ్చి, వారితో HDFC, South Indian Bankలలో అకౌంట్లు తెరిపించేవారు. అయితే నిరుద్యోగుల పేరుతో తెరిచిన బ్యాంక్ అకౌంట్ల క్రెడెన్షియల్స్ తీసుకుని, ఆయా అకౌంట్లలో సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును జమ చేయడానికి వినియోగించేవారు.

అయితే ఈ తరహా దోపిడీకి పాల్పడిన ఉడతనేని వికాస్ చౌదరి ముఠాకు తమ అకౌంట్లను ఇచ్చి, సహకరించినందుకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిందితుల తరపున ఏజెంట్లుగా వ్యవహరించిన మరో 11 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరేగాక హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తిని పెట్టుబడుల పేరుతో రూ. 14.00 కోట్లకు మోసం చేసిన ఘటనలో ఇంకొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్లు సీపీ సునీల్ దత్ వెల్లడించారు.

ఉడతనేని వికాస్ చౌదరి ముఠా వలలో చిక్కుకుని అరెస్టయిన యువకులు

మొత్తంగా ఈ భారీ సైబర్ దోపిడీ కేసులో ఇప్పటి వరకు మొత్తం 18 మందిని అరెస్ట్ చేయగా, అందులో అసలు ముఠాలోని ఓ సభ్యుడైన పోట్రు ప్రవీణ్ కూడా ఉన్నారు. అయితే ముఠా వలలో చిక్కుకుని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారని, ఏజెంట్లుగా వ్యవహరించారని 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ముఠాలోని కీలక నిందితులను ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై సమాజంలో సహజమైన అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

పోట్రు మనోజ్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)

ముఖ్యంగా ముఠా లీడర్ గా భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి అనే యువకుడు అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి షడ్రకుడి సుపుత్రుడు కావడం గమనార్హం. అదేవిధంగా మరో నిందితుడైన పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే యువకుడు సత్తుపల్లి బీజేపీ నాయకుడు. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పోట్రు ప్రవీణ్ మాత్రం బీఆర్ఎస్ నాయకుడు. ముఠాలోని భానుప్రియ అనే మహిళ పోట్రు మనోజ్ కళ్యాణ్ భార్యగా పోలీసులు గుర్తించారు. మేడా సతీష్ అనే ఇంకో నిందితుడు మనోజ్ కళ్యాణ్ బామ్మర్దిగానూ పోలీసులు ప్రకటించారు.

సైబర్ దోపిడీ ఘటన, అరెస్టుల గురించి వివరిస్తున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, చిత్రంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ ముత్తిలింగం

ఈ నేపథ్యంలో సైబర్ నేరాల ముఠాకు ‘సహకరించారు’ అనే కారణంతో 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, ఆయన భార్య, బామ్మర్ది ఎందుకు చిక్కడం లేదనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికిప్పుడు జవాబు లేదు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, కొనసాగుతోందని, ప్రధాన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియా సమావేశంలో ప్రకటించడం కొసమెరుపు.

Popular Articles