Top 5 This Week

Related Posts

సత్తుపల్లి సైబర్ దోపిడీ కేసులో ‘తేలు కుట్టిన రాజకీయం’!

(సమీక్ష ప్రత్యేక కథనం)
‘తేలు కుట్టిన దొంగలు’ అనే సామెత గురించి తెలుసు కదా..? దొంగతనం చేసిన వ్యక్తికి తేలు కుడితే అరవలేడు.. అరిస్తే పట్టుబడవచ్చు.. కానీ కుట్టిన తేలు విషం శరీరంలోకి పాకుతూ భరించలేని మంట పుడుతుంది.. అరవలేక నోరు మూసుకుని బాధపడే దీనావస్థ చోరీకి వచ్చిన దొంగ స్థితి. ఈ సామెతకు సంబంధించి తెనాలి రామలింగడి నీతి కథలు అనేకం ఉన్నాయి. ఇప్పుడీ సామెత ప్రస్తావన దేనికంటే..? సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయం చేసే ప్రధాన పార్టీల పరిస్థితి అచ్చంగా ‘తేలు కుట్టిన దొంగ’ సామెతను అన్వయించే విధంగా ఉందనే చర్చ జనంలో జరుగుతోంది.

సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ. 549.95 కోట్లు కొల్లగొట్టిన ఘటనలో సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో రాజకీయం నెరపే ప్రధాన పార్టీలు నోరెందుకు మెదపడం లేదు? ఇదీ ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజల్లో జరుగుతున్న చర్చ. సత్తుపల్లి ప్రాంతానికే చెందిన కీలక వ్యక్తులు సహా ఆరుగురు ముఠా సభ్యులు ఆస్ట్రేలియా పౌరులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడి రూ. 549.95 కోట్ల మొత్తాన్ని దోచుకున్న ఘటనపై నిన్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

సైబర్ దోపిడీ ఘటనపై పెనుబల్లి పోలీస్ ష్టేషన్ లో సీపీ సునీల్ దత్ ఆదివారం మాట్లాడినప్పటి చిత్రం

ఈ నేరాలకు పాల్పడిన ఆయా ముఠాలో ఉడతనేని వికాస్ చౌదరి గ్యాంగ్ దురాగతాలను పోలీసులు బట్టబయలు చేశారు. వికాస్ చౌదరితోపాటు పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే వ్యక్తులు కూడా ఈ దోపిడీలో కీలక నిందితులుగా పోలీసులు గుర్తించారు. దోచుకున్న వందల కోట్ల సొమ్మును తమ కుటుంబ సభ్యులు, అనుచరుల ఖాతాల్లోకి మళ్లించినట్లు కూడా పోలీసులు ప్రకటించారు. అయితే ఇంత భారీ సైబర్ నేరాల దోపిడీ కేసుపై ఖమ్మం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదనేది అసలు ప్రశ్నగా పలువురు సంధిస్తున్నారు.

వాస్తవానికి అత్యంత చైతన్యంగల రాజకీయాలకు ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ఖ్యాతి ఉంది. రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే ముఖ్యనాయకులు ఉన్న ఖమ్మం జిల్లాలో వెలుగు చూసిన వందలాది కోట్ల రూపాయల సైబర్ ఛీటింగ్ కేసుపై పెద్దగా రాజకీయ స్పందన లేకపోవడం కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ కేసులో నిందితులైన వ్యక్తుల స్థితి ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఈపాటికి ‘జెండాలు’ ఎగరేస్తూ రోడ్లపై బీభత్స ప్రదర్శన నిర్వహించేవనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ అంశంలో ప్రధాన రాజకీయ పార్టీలుగాని, వాటి ముఖ్య నాయకులుగాని నోరెందుకు మెదపడం లేదో ఓసారి లోతుగా పరిశీలిస్తే..

కేటీఆర్ తో పోట్రు కళ్యాణ్ (ఫైల్ ఫొటో)

ఈ దోపిడీ కేసులో ఇప్పటికే అరెస్టయిన పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పోట్రు ప్రవీణ్ సన్నిహితంగా మెలిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో పలు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన బీఆర్ఎస్ నాయకులకు ప్రవీణ్ ‘కట్టల’ కొద్దీ డబ్బును విసిరేసినట్లు ప్రచారం ఉంది. అంతేకాదు స్వగ్రామమైన కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి సర్పంచ్ గా తన తండ్రిని గెలిపించుకునేందుకు రూ. 3.00 కోట్ల మొత్తాన్ని ప్రవీణ్ ఖర్చు చేశాడనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది. ప్రతి ఓటుకు రూ. 15-20 వేల వరకు ఇచ్చినట్లు ప్రచారపు సారాంశం. ఈ నేపథ్యంలోనే రూ. 549.95 కోట్ల సైబర్ నేరాల దోపిడీ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నోరెత్తడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోట్రు కళ్యాణ్ (ఫైల్ ఫొటో)

అదేవిధంగా ఇదే కేసులో మరో కీలక నిందితుడైన పోట్రు మనోజ్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడు. సత్తుపల్లి పట్టణ పార్టీ అధ్యక్షునిగా గతంలో పనిచేశాడు. పోట్రు కళ్యాణ్ ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియ ఖాతాలో రూ. 45.62 కోట్లు, బామ్మర్ది ఖాతాలో 135.48 కోట్లు సహా మొత్తం 295.28 కోట్లు ఇతని సంబంధీకుల ఖాతాల్లోనే లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీల్లో మేజర్ షేర్ బీజేపీ నాయకుడు పోట్రు కళ్యాణ్ దేనని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూ. 549.95 కోట్ల సైబర్ నేరాల దోపిడీ ఘటనపై బీజేపీకి చెందిన నాయకులెవరూ నోరెత్తడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ‘సిరిగోల్డ్’ సంస్థ వ్యవహారంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు, సత్తుపల్లి నాయకుుడు కూసంపూడి రవీంద్రలపై హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పటికే వివాదాస్పదం కావడం ఈ సందర్భంగా గమనార్హం.

ప్రతీకాత్మక చిత్రం

ఇకపోతే మొత్తం దోపిడీ ముఠాకు కీలక నాయకునిగా ప్రాచుర్యం పొందిన ఉడతనేని వికాస్ చౌదరి వ్యవహారం మరింత ఆసక్తికరం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇతని బ్యాంకు ఖాతాలో రూ. 80.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పోట్రు ప్రవీణ్ అరెస్ట్ తర్వాత పోలీసులు ఉడతనేని వికాస్ చౌదరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువస్తుండగా, అధికార పార్టీ ‘రాజకీయం’ అడ్డుకుందనే ధ్రువపడని సమాచారం వ్యాప్తిలోకి వచ్చింది. హైదరాబాద్ లో ఉడతనేని వికాస్ ను పట్టుకుని తీసుకువస్తుండగా, ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రతినిధులు పోలీసులను వెంబడించి మరీ నానక్ రాం గూడ టోల్ గేట్ వద్ద అడ్డుకుని ఎందుకు తీసుకువెడుతున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాము పోలీసులమని చెప్పగానే ఆయా ఛానల్ ప్రతినిధులు మెల్లగా జారుకున్నట్లు సమాచారం.

అయితే ఆ తర్వాతే అసలు ‘రాజకీయం’ మొదలైందంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి తోడల్లుని కుమారుడైన ఉడతనేని వికాస్ చౌదరిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో.. ప్రముఖ ఛానల్ ప్రతినిధులు జారుకున్న తర్వాత స్టోరీ రంజుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నతస్థాయి అధికారంలో గల నాయకుడొకరు జోక్యం చేసుకుని ఉడతనేని వికాస్ చౌదరిని వదిలేయాల్సిందిగా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారట. దీంతో అతని ‘పవర్’కు అనివార్యంగా పోలీసులు తలొగ్గి వికాస్ చౌదరిని వదిలేయక తప్పలేదనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల అరెస్ట్ నుంచి ఈ విధంగా తప్పించుకున్నట్లు ప్రచారంలో గల వికాస్ చౌదరి దోపిడీ స్టోరీలో అధికార పార్టీ నాయకుడి ప్రమేయం సుస్పష్టమనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రూ. 549.95 కోట్ల సైబర్ నేరాల దోపిడీ ఘటనపై అధికార పార్టీ నాయకులు కూడా నోరెత్తడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

అయితే మొత్తం ఎపిసోడ్ లో ఈ సందర్భంగా ఆసక్తికర అంశమేమిటంటే.. రాజకీయాల్లో వ్యక్తిత్వంపై తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గత నెల 28వ తేదీన అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. నిబద్ధతతో రాజకీయాల్లో పని చేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, రాజకీయాల్లో క్యారెక్టర్ దెబ్బ తింటే ఎంత డబ్బు ఉన్నా ఓడిపోతామని ఆయన పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రాంతానికి చెడ్డపేరు తీసుకురావద్దని తుమ్మల హితవు చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తుమ్మల చేసిన ఈ వ్యాఖ్యలు రూ. 549.95 కోట్ల దోపిడీ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా చర్చకు దారి తీశాయి. పదిహేను రోజుల క్రితం మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఉడతనేని వికాస్ చౌదరికి అండగా నిలిచిన అధికార పార్టీ నాయకుడి గురించేనా..? అనే ప్రశ్న ప్రామాణికంగా ఈ చర్చ జరుగుతుండడం కొసమెరుపు.

Popular Articles