హత్యోదంతంలో ఇద్దరు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. వ్యక్తిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన కేసులో ఈ తీర్పును వెలువరించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 19వ తేదీన కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావును అదే గ్రామానికి చెందిన అతడి బంధువు పాటిబండ్ల శివ చెన్నూరు – రంగాపురం రోడ్డుపై కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఘటనపై మృతుడి భార్య కృష్ణమ్మ కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు శివతోపాటు అతడి తల్లి రమాదేవి, తండ్రి అర్జునరావు, నూతలపాటి నారాయణరావు, పస్తం రంగారావు మొత్తం ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు పూర్వపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఎ1 శివ, ఎ5 రంగారావులపై నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ అబ్దుల్ బాషా వాదించగా, ఐఓలుగా సీఐ హనోక్, ఎస్ఐ రఘు, సీడీవో మల్లికార్జునరావు సహకరించారు. కాగా ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలతో దోషులకు శిక్షపడే విధంగా విధులు నిర్వహించిన ఆయా అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రశంసించారు.