మున్నూరుకాపు సంఘం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగా సర్ధార్ పుటం పురుషోత్తమరావు ఎన్నికయ్యారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఉత్సాహభరిత వాతావరణంలో సజావుగా, పారదర్శకంగా, ప్రశాంతంగా ఆదివారం ఎన్నికలు జరిగాయి.హైదరాబాద్ జలవిహార్ ప్రాంగణంలో మున్నూరుకాపు సంఘం అత్యున్నత నిర్ణాయక మండలి అయిన అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన నియమింపబడిన కమిషన్ ఈ ఎన్నికలను ప్రజాస్వామిక పద్ధతిలో, అందరికి ఆమోదయోగ్యంగా నిర్వహించారు.
ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షునిగా సర్థార్ పుటం పురుషోత్తమ రావు పటేల్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య పటేల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా కంచె సత్యనారాయణ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.ఎన్నికల ప్రధానాధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జే.డీ.లక్మీనారాయణతోపాటు ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారి మంగపతిబాబు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఎర్రా నాగేంద్రబాబు, న్యాయ సలహాదారులు సీనియర్ అడ్వకేట్లు ఊసా రఘు, లవంగాల అనిల్ వ్యవహరించారు.

సంఘం నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన పురుషోత్తమ రావు, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, కోశాధికారి సత్యనారాయణల చేత ఎన్నికల ప్రధానాధికారి లక్ష్మీనారాయణ ప్రమాణం చేయించి, ఎన్నికైన ధ్రువపత్రాలు అందజేశారు. సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా వేణుగోపాల్ పటేల్, డాక్టర్ జే.ఏన్.వెంకట్ పటేల్,చల్లా హరిశంకర్ పటేల్,మహిళా విభాగం అధ్యక్షురాలుగా బండి పద్మక్క పటేల్ ను అపెక్స్ కౌన్సిల్ నియమించి, వారికి పత్రాలు అందజేశారు. ఎన్నికైన, నియమితులైన వారిని పలువురు శాలువాలతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.