భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీసీఆర్బీ (డిస్ట్రిక్ట్ క్రైం రికార్డ్ బ్యూరో)లో సీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ వ్యవహార తీరుపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. వివాదాస్పద అధికారిగా వార్తల్లో గల సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై వెంటనే నివేదిక సమర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్ వేర్వేరుగా శ్రీనివాస్ పై నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఐ శ్రీనివాస్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీసీఆర్బీ విభాగపు సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సీఐ శ్రీనివాస్ ఖమ్మం మమత కాలేజీలోని హెలీపాడ్ వద్ద కేటీఆర్ కోసం బీఆర్ఎస్ నాయకులతో కలిసి వేచి చూసినప్పటి దృశ్యం పోలీస్ శాఖలో కలకలానికి దారి తీసింది. ఖమ్మానికి 80 కి.మీ. దూరంలో గల కొత్తగూడెంలో విధుల్లో ఉండాల్సిన సీఐ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి సంచరించిన ఉదంతం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇదే అంశంపై ‘కేటీఆర్ టూర్ లో సీఐ ప్రత్యక్షం, వివాదం’ శీర్షికన నిన్న ‘సమీక్ష’ న్యూస్ ప్రచురించిన వార్తా కథనం వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అటు భద్రాద్రి జిల్లా ఎస్పీ నుంచి, ఇటు ఖమ్మం పోలీస్ కమిషనర్ నుంచి శ్రీనివాస్ వ్యవహారశైలిపై నివేదికల సమర్పణకు ఆదేశించినట్లు సమాచారం. తమ పరిధిలో డ్యూటీలో ఉండాల్సిన సీఐ శ్రీనివాస్ ఖమ్మంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉండడంపై భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం వచ్చిన మరుక్షణమే తన ముందు రిపోర్ట్ చేయాలని కూడా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించినట్లు సమాచారం. ఎటువంటి సెలవు కూడా తీసుకోకుండానే శ్రీనివాస్ కేటీఆర్ ను కలిసేందుకు వచ్చినట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇదే దశలో కేటీఆర్ ఖమ్మం పర్యటనలో సీఐ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉన్న ఘటనపై నివేదిక సమర్పించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ ను కూడా పోలీసు ఉన్నతాధికారులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం సీపీ సునీల్ దత్ తోపాటు, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లు వేర్వేరుగా శ్రీనివాస్ తీరుపై రూపొందించిన తమ నివేదికలను ఉన్నతాధికారులకు గత రాత్రి పంపించినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల్లో గులాబీ పార్టీ నాయకులతో సన్నిహితంగా కలిసి ఉండడం, కేటీఆర్ పర్యటనలో పాల్గొన్న వివిదాస్పద సీఐ శ్రీనివాస్ పై శాఖాపరంగా ఉన్నతాధికారులు తీసుకునే చర్యలపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.

