“నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేశారు. ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది! నా జీవిత చరమాంకంలో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న. నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు. ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. నాపై చాలామంది నమ్మకం ఉంచారు. సపోర్ట్ చేశారు. కొందరు నమ్మలేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్న! నా గురించి బాగా తెలిసిన చంద్రబాబు గారు కూడా నన్ను వాడు వీడు అన్నారట! నేను సుప్రీం కోర్టుకు వెళ్లేంత ఏం సంపాదించలేదు. నేను మధ్య తరగతికి ఇంకా కిందే వున్నాను. నేను లేకున్నా నా పేరిట KSR షో నిర్వహించారు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు”… ఇది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీ నుంచి ఇచ్చిన వివరణ. రెండు సార్లు ఉద్వేగానికి గురై కంట తడి పెట్టారు. గద్గద స్వరంతో వినిపించారు తన ఆవేదనను. పూర్తిగా అవే మాటలు కాకున్నా ఇదే అర్ధపు భావనతో మాట్లాడారు.
ఆయన మాటలు విన్నాక, ఆయన ఆవేదన చూశాక బాధ అనిపించలేదు. నాకు నవ్వు వచ్చింది. జైలులో ఉండి వచ్చి కూడా ఆయనలో మార్పు రాలేదు అనిపించింది. ఉద్యోగం ఇచ్చిన బాస్ కు కృతజ్ఞతలు చెప్పడాన్ని నేను తప్పు పట్టడం లేదు. అంత డబ్బు పెట్టి బెయిల్ ఇప్పించిన వారికి ధన్యవాదాలు చెప్పిన విధానాన్ని తప్పు పట్టడం లేదు. ఆయన చేసిన తప్పును తెలుసుకోలేకపోవడాన్ని మాత్రమే నేను తప్పు పడుతున్నాను.

గతంలో ఆయనకు చంద్రబాబుకు మధ్య విబేధాలు ఉండొచ్చు! ఆయన సాక్షి టీవిలో చేరి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ విమర్శలు చేస్తూ ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులకు వున్న స్వేచ్ఛ అది. అది వేరే విషయం. ఇప్పుడు కొమ్మినేని విడుదలైంది నిర్దోషిగా కాదు. కేవలం బెయిల్ పై మాత్రమే. కానీ, ఇవాళ ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన నిర్దోషిగా సుప్రీం కోర్టు బయట పడేసినట్లు మాట్లాడారు. న్యాయవాదుల వాదనలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల స్వేచ్ఛను బట్టి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. ఆ రోజు డిబేట్ లో కొమ్మినేని బాడీ లాంగ్వేజ్, వెటకారపు నవ్వు, అవును నేను హిందూలోనో టైమ్స్ లోనో చూశానని సమర్థింపును ఆ బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి చూసి ఉండక పోవచ్చు. ఆ పాయింట్స్ ను ఎదుటి లాయర్లు చూపించకపోయి ఉండొచ్చు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ లోతుల్లోకి నేను వెళ్ళదలచుకోలేదు. బెయిల్ లభించింది సంతోషం.

ఇప్పటికీ కొమ్మినేని గారిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యంగా వుంది. నాదేం లేదు. నేను నల్లపూసను. నేనేం తప్పు చేయలేదు, చేయను. చంద్రబాబు గారిని కూడా గారు అని సంభోదించమని చెబుతుంటా.. అని ఇవాళ ఆయనే అన్నారు. అంత మంచి వ్యక్తికి ఆయన చేసిన తప్పు తెలియనితనం అంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత జరిగాక అయినా, ఆ అమరావతి మహిళలకు ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఆయన కన్నీటికి అర్ధం ఉండేది. పైగా ఆయన నిర్వహించే షో లో అన్ని నిజాలే వుంటాయని ఆ టీవీలో కూర్చుని చెప్పడం ఇంకా నవ్వు తెప్పిస్తోంది. మీరు అనుకున్నట్లు మచ్చ తొలగిపోలేదండి. మచ్చ మాత్రం చెదరిపోదులే అని మాత్రమే అనిపిస్తోంది!
– డా. మహ్మద్ రఫీ