ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక మహిళా నేత మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మహిళా నక్సలైట్ ను గుమ్మడవెల్లి అరుణ అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా పోలీసులు గుర్తించారు. అరుణ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా వ్యవహరించిన శాఖమూరి అప్పారావు భార్య కావడం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండికి చెందిన అరుణ న్యాయశాస్త్రం చదవారు. విప్లవ కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలై 1996లో అప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీలో చేరారు. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీ కలక నేత శాఖమూరి అప్పారావును 2005లో పెళ్లి చేసుకున్నారు. అయితే నల్లమల అడవుల్లో 2010లో జరిగిన ఎన్కౌంటర్ లో శాఖమూరి అప్పారావు మృతి చెందారు.
తాజాగా బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన అరుణ మావోయిస్టు పార్టీ పత్రిక ‘ప్రభాత్’కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అరుణ సోదరుడు జీవీకే ప్రసాద్ కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేసి, గతంలోనే పోలీసులకు లొంగిపోయారు. అరుణపై మొత్తం నాాలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా అరుణ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగానూ వ్యవహరిస్తున్నారు.