హైదరాబాద్: కర్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులపై రేవంత్ రెడ్డి సర్కారు ఎట్టకేలకు దయ తలచింది. వచ్చే 45 రోజుల్లో మూడు దఫాలుగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 22వ తేదీన తొలివిడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యాసంగి నిధులను విడుదల చేయనున్నారు.
అయితే గత పద్ధతికి భిన్నంగా ఈసారి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీలు నిర్ణయించడం గమనార్హం. గతంలో ఓ నిర్ణీత తేదీన నిధు విడుదల ప్రారంభమైతే, వరుసగా ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు చొప్పున రోజులవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. ఈసారి ఎకరం లోపు భూములు గల 70 లక్షల మందికి ఈనెల 22వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత నిధులను మరో 20 రోజుల తర్వాత.. అంటే ఏప్రిల్ 12వ తేదీలోగా విడుదల చేయనున్నారు.
ఇక ఏప్రిల్ నెలాఖరులోగా మూడో దఫాగా మొత్తం రైతు భరోసా నిధులను విడుదల చేస్తారట. మొత్తంగా మూడు విడతల్లో కలిపి రూ. 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులతో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
